పోలీసులకు ఇన్నోవాలు సమకూర్చడమే సంక్షేమమా: మంత్రి శ్రీధర్ బాబు

by Malleboina Mahesh |

బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్‌కు వారి గురించి మాట్లాడే హక్కు లేదు. అసెంబ్లీలో మీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు - మంత్రి శ్రీధర్ బాబు.

పోలీసులకు ఇన్నోవాలు సమకూర్చడమే సంక్షేమమా: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని, బీసీల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) విమర్శించారు. శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ సంక్షేమం, పోలీసు శాఖ, ఆర్టీసీ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీస్ సంక్షేమం అంటే కేవలం ఇన్నోవా కార్లు సమకూర్చడం మాత్రమే కాదని, తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి నిజమైన చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. రవాణా శాఖలో పారదర్శకత కోసం టెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని, ఆర్టీసీని నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కనీసం పలకరించని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ముందడుగు వేస్తుంటే, ప్రతిపక్షం ఓర్వలేక వెనక్కి లాగే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వం వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని హితవు పలికారు. సభలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం బీఆర్ఎస్ సభ్యులకు అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు. "వాకౌట్ చేస్తే రోజంతా చేయాలి.. కానీ బయటకెళ్లి మళ్లీ లోపలికి రావడం ఏంటి? మీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారనే విషయం మర్చిపోవద్దు" అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు.

Next Story