ప్రజలకు అండగా ఉండటమే తప్పా? ఎమ్మెల్యే కేటీఆర్

by Geesa Chandu |

ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం సిగ్గు చేటు అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు.

ప్రజలకు అండగా ఉండటమే తప్పా? ఎమ్మెల్యే కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం సిగ్గు చేటు అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. దాడికి గురైన పార్టీ సీనియర్ నేతలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల దాడిని మంగళవారం తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి వాహనాలపై దాడి కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం అన్నారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక...సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. ఈ దాడికి సీఎం సహా, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా సరే...ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరన్నారు. దాడులకు బెదరం... బీఆర్ఎస్ కు ఇలాంటి దాడులు కొత్త కాదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేత గాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం అన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను అభినందించారు.

పోలీసులకు అభినందనలు..

అచ్చంపేటలోని డిండి కెనాల్‌లో చిక్కుకుపోయిన 10 మంది గిరిజనుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళను కాపాడిన పోలీసులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. దాదాపు మూడు రోజుల క్రితం వరదల్లో చిక్కుకుపోయిన ఈ పది మందిని రక్షించే విషయంలో కాంగ్రెస్ సర్కార్ అలసత్వం ప్రదర్శించిందన్నారు. సరైన సమయంలో హెలికాప్టర్లు తెప్పించి ఉంటే వారందరినీ ఒక్కరోజులోనే రక్షించగలిగే వారని, కానీ ఈ అహంకారపూరిత ముఖ్యమంత్రి మాత్రం ఆ గిరిజనులను రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. పోలీసులే కష్టపడి వారిని రక్షించారన్నారు. తెలంగాణలో వరద బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ల అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని, అంటే ఈ పదిమంది గిరిజన బిడ్డలను రక్షించేందుకు హెలికాప్టర్లు అవసరం లేదని ప్రభుత్వం అనుకుందా? మీ నాయకుల పుట్టిన రోజులకు, మీ ఎమ్మెల్యేలు ప్రయాణించేందుకు హెలికాప్టర్లు ఉంటాయి గానీ పేద గిరిజనులను రక్షించేందుకు మాత్రం హెలికాప్టర్లు ఎందుకు అంటారా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత లెక్క లేకుండా పోయిందా? ప్రజలు ఆపదలో ఉంటే ఈ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.

సీఎం పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం..

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటించినప్పటికీ బాధితులకు పైసా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వరద బాధితులంతా తమను ఆదుకుంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ వారికి నిరాశ తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన లో ఎంత మందికి సాయం చేశారో...ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారో వివరాలు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “సీఎం రెండు రోజుల పర్యటనతో ప్రజలకు ఒరిగింది శూన్యం. బాధితుల కష్టాలు తీరలేదు. వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. లక్షల్లో బాధితులుంటే..వందల్లో కూడా సాయం చేయలేదు” అని అన్నారు. వరదల వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాల్లోని చిన్న పిల్లలకు కనీసం పాలు, బాధితులకు తాగునీరు, భోజన వసతి కల్పించడంలో కూడా విఫలమయ్యారన్నారు.

లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లితే...రైతులకు కనీసం పైసా కూడా పరిహారం అందించలేదని మండిపడ్డారు. ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలితే తూతూ మంత్రంగా పదివేలు ప్రకటిస్తారా అంటూ ప్రశ్నించారు. పీఆర్ స్టంట్లతో కాలం గడుపుతామంటే కుదరదని హెచ్చరించారు. బాధితుల కన్నీళ్లు తుడవాల్సిన సీఎం వారిని దరిదాపుల్లోకి కూడా రానీయకుండా ప్రచార రథంపై ఊరేగటమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కి తమ బాధలు చెప్పాలనుకున్న ఆడబిడ్డల ఆర్థానాదాలు కూడా వినకుండా వెళ్లిపోయిన మనసు లేని ముఖ్యమంత్రిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో అడుగడుగునా ప్రజల్లో కనిపించిన కట్టలు తెంచుకున్న ఆగ్రహం మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపించిందన్నారు. సీఎంను కలిసి బాధ చెప్పుకుందామని ప్రయత్నించిన వారిని భద్రతా సిబ్బంది లాగిపారేయడం, లాఠీలు ఝుళిపించడం అత్యంత దారుణమని కేటీఆర్ అన్నారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలంతా ఆగమైన 24 గంటలకు సీఎం మొద్దు నిద్ర వీడారన్నారు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్లారే తప్ప బాధితుల కష్టాలు తీర్చలేదని ధ్వజమెత్తారు. ప్రజల కన్నీళ్లు తుడవాల్సింది పోయి సాయం చేద్దామని వచ్చిన బీఆర్ఎస్ నేతలపై దాడిచేయడం అధికారపక్షం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ప్రజల గోడు వినని ముఖ్యమంత్రి పర్యటించినా.. పర్యటించకపోయినా ఒక్కటే. ఈ పరిపాలనా వైఫల్యం కాంగ్రెస్ ఎల్లకాలం వెంటాడుతుందన్నారు. కచ్చితంగా చేతగాని, అసమర్థత సీఎం కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

Next Story