- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకేనా జీవో నెం.49.. మావోయిస్టుల సంచలన లేఖ
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేందుకు కేంద్ర ప్రభుత్వం జీవో నెం.492ను తీసుకొచ్చిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేందుకు కేంద్ర ప్రభుత్వం జీవో నెం.492ను తీసుకొచ్చిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో సంచలన విషయాలను ప్రజల ముందు పెట్టారు. ఆదివాసి ప్రజల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో జిల్లా ఏర్పాటైందని అన్నారు. ఇప్పుడు అదే జిల్లాలో సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళా చేయించాలని తేదీ 2025, మే 5న తీసుకొచ్చిన జీవో నెం.49ను వెంటనే రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు
మానవ రూపంలో ఉన్న పులులు మోడీ, అమిత్ షా..
జీవో నెం.49 ముఖ్య ఉద్దేశం జంతువులు కోసం కాదు అనేది వాస్తవమని అన్నారు. మానవ పులులైన మోడీ, అమిత్ షాలకు మానసపుత్రులైన అదాని, అంబానీ, కార్పోరేట్ సంస్థల కోసమే ఆ జీవోను తెచ్చారనే విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు. వేల ఏళ్లుగా అడవిని, అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. వారి జీవనాన్ని, సంస్కృతి సాంప్రదాయాలు, అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆక్షేపించారు.
ఆ మూడు జిల్లాలు ఇక తెలంగాణ మ్యాప్‌లో కనిపించవు..
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. కొమరంభీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదని అన్నారు. దేశంలోని మైదాన ప్రాంతాలు, చెరువులు, నదులు, కొండలు, గుట్ట సర్వనాశనం చేసేందుకు దోపిడీదారులు కుట్రలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలను, సంపదను దొంగిలించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఆదివాసులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీస్ బలగాలతో చిత్ర హింసలకు గురిచేస్తూ చంపుతున్నారని ఆరోపించారు.
ఐక్యరాజ్య సమితి చెప్పినా వినరా..?
టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ యూ, వాంకిడి, జైనూర్, కెరమెరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్నగర్, నార్నూర్, సిర్పూర్ (టీ), చింతల మానపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్య రాజ్యసమితి నిపుణులతో పాటు మానవ హక్కుల విభాగం అభ్యతరం వ్యక్తం చేస్తూ.. అలాంటి పనులు మానుకోవాలని భారత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోవట్లేదని అన్నారు. అడవిలోని సంపదకు, మొత్తం భూభాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివాసులే అని భారత రాజ్యాంగం చెబుతోందని. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తోంది లేఖ ద్వారా ప్రజల దృష్టి తీసుకొచ్చారు.
కీలక డిమాండ్స్ ఇవే..
ఇప్పటికే కిల్వాల్ టైగర్ జోస్ పేరుతో ఆదివాసులను అడవికి దూరం చేసిన పాలకులు ఆదివాసులను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. వారిని బ్రతుకులను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 12 లక్షల ఎకరాలతో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ మొదలు కాలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి భూమాతలో కూడా నమోదు చేయాలన్నారు. అదేవిధంగా వారికి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసి సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయ సమ్మతమైన, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండ్లను తప్పక వెంటనే పరిష్కరించాలని అన్నారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణ బాధ్యత మంత్రి సీతక్కదే..
ములుగు జిల్లాలోని ఆదివాసి ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో, కేసుల బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివాసి బిడ్డ, మాజీ నక్సలైట్‌గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం జరగడం సిగ్గుచేటు, అవమానకరం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ ఎందుకు ఆదివాసుల గురించి మాట్లాడడం లేదనే విషయాన్ని ప్రజలు గూడెల్లో చర్చించుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్-5 గురించి, 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పెసా చట్టం గురించి, 2006లో కాంగ్రెస్ తెచ్చిన FRA 1/70 చట్టం గురించి సీతక్క మరచిపోయిందా అని అన్నారు. రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి, భారత రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడుతున్నారని.. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధి జీవులారా వేల ఏళ్లుగా దేశ సంపదను కాపాడుతున్న దేశ మూలవాసులైన ఆదివాసులను కాపాడుకోవడం ప్రజలందరి భాద్యత అని అన్నారు. వాళ్లంతా అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. అందుకు మనమంతా ఆదివాసుల హక్కుల అమలు కోసం వాళ్లకు అండగా ఉందామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు.






