T CONGRESS: ఇక మంత్రిగా అజారుద్దీన్? జూబ్లీహిల్స్ రేస్ నుంచి తప్పించడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-08-30 11:29:15  IST  )

అజారుద్దీన్ కు మంత్రి పదవి ఖాయమేనా?

T CONGRESS: ఇక మంత్రిగా అజారుద్దీన్? జూబ్లీహిల్స్ రేస్ నుంచి తప్పించడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?
X

దిశ, డైనమిక్/తెలంగాణ బ్యూరో: స్టేట్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్ చుట్టూ రాజకీయం జోరందుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాంతో పాటు అజారుద్దీన్ (Azharuddin) కు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం అందరిని సర్ ప్రైజ్ లోకి నెట్టింది. మీర్ అలీఖాన్ ను పక్కన పెట్టి అనూహ్యంగా అజారుద్దీన్ పేరును ఖరారు చేయడం చర్చనీయాశం అవుతున్నది. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అజారుద్దీన్ ను ఉన్నట్టుండి శాసనమండలికి పంపించాలన్న కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం ఆలోచన వెనుక స్ట్రాటజీ ఏంటి అనేది ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. సమీకరణాల దృష్ట్యా అజారుద్దీన్ ఎమ్మెల్సీగా విజయం ఖాయం కావడంతో పాటు ఆయనకు డబుల్ బోనస్ దక్కబోతున్నదని టాక్ వినిపిస్తోంది.

మంత్రిగా అజారుద్దీన్?:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా గెలవకపోవడంతో కేబినెట్ లో ఆ వర్గానికి స్థానం దక్కలేదు. అలాగే హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఈ జిల్లాకు సైతం మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ క్రమంలో హైదారాబాద్ కు చెందిన మైనార్టీ వ్యక్తి మీర్ అలీఖాన్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ క్రమంలో అజారుద్దీన్ ను అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమ్మెల్సీగా ప్రకటించడం వెనుక ఈయనను మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు మైనార్టీ కోటా, హైదరాబాద్ జిల్లా కోటా కింద అజారుద్దీన్ కు మంత్రి వర్గంలోనూ చోటు కల్పించాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా గెలుపొందినా మంత్రి పదవి విషయంలో అజారుద్దీన్ అదృష్టాన్ని ఖరారు చేసేంది మాత్రం జూబ్లీహిల్స్ బై పోలేనా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరో మైనార్టీ నేతను రంగంలోకి దింపకుండా ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపితే అజారుద్దీన్ కు మంత్రి పదవి దాదాపు ఖాయం అని అలా కాకుండా మైనార్టీ నేతనే బరిలోకి దింపినా అజారుద్దీన్ మంత్రి పదవి ఆశలపై మరింత ఉత్కంఠ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇక సమీకరణాల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ సైతం కీలకం కాబోతున్నదనే టాక్ సైతం ఉంది.

జూబ్లీహిల్స్ రేస్ లో ఎవరు?:

అజారుద్దీన్ పేరును ఎమ్మెల్సీగా ఖరారు చేయబోతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో (Jubilee Hills by poll) కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. తాజా పరిణామాలతో ప్రస్తుతం మరో కొంత మంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ గా ఉన్న రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, బొంతురామ్మోహన్ పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. మంత్రి పదవి కోరుతున్న దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయని గాంధీ భవన్ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ నుంచి మాగంటి కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ఇందుకు ఆ పార్టీ అధిష్టానం సైతం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడం, స్థానిక ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థి విషయంలో లోకల్ ఫ్లేవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మైనార్టీయేతర వ్యక్తిని రంగంలోకి దింపుతుందనే అంచనాతో పాటు బీజేపీ సైతం మైనార్టీ ఇష్యూను తమ అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ సైతం మైనార్టీయేతర వ్యక్తినే అభ్యర్థిగా ప్రకటించి ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పక్కాగా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story