భూమి పోతే బతుకేం మిగులుతుంది..? రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా గ్రామాల రేవు

by Bhanu |

మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ సమీపంలో డిండి ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న రిజర్వాయర్‌ను రద్దు చేయాలని

భూమి పోతే బతుకేం మిగులుతుంది..? రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా గ్రామాల రేవు
X

దిశ, మాడ్గుల : మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ సమీపంలో డిండి ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న రిజర్వాయర్‌ను రద్దు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీరు అందించేందుకు కాలువల ద్వారా నీటిని తరలించేందుకు గ్రామ సమీపంలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయగా చిన్నసన్నకారు రైతులకు సంబంధించి 1,348 ఎకరాల సాగు భూమిని కోల్పోతున్నట్లు చెప్పారు. ఈ రిజర్వాయర్‌లో సుమారు 5 వేల వరకు తాటి చెట్లు పోతుండడంతో ఇర్విన్, నల్లచెరువు, వెల్దండ మండలం అజలాపూర్ గ్రామాలకు చెందిన గీతకార్మికులు ఉపాధిని కోల్పోతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. అత్యవసర పరిస్థితులలో రిజర్వాయర్ నిర్మాణం చేపడితే భూములు కోల్పోతున్న రైతులకు భూములతో పాటు ఫార్మా రైతులకు అందిస్తున్న విధంగా ప్లాట్లను కేటాయించి ఆదుకోవాలని, అది కాకుంటే త్రిబుల్ ఆర్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ భూములకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రిజర్వాయర్ నిర్మించొద్దు.. : బాధిత రైతు బొమ్మల రాములు

రిజర్వాయర్ నిర్మాణంలో తనకు ఉన్న ఒక ఎకరా 38 గుంటల భూమి పోతుంది. మాకు ఈ భూమి తప్ప మరే ఆధారం లేదు. వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. భూమి కోల్పోతే చావే శరణ్యమం. వెంటనే రిజర్వాయర్‌ను రద్దు చేయాలి.

మరోచోటికి తరలించండి..: రైతు సూదిని అంజన్ రెడ్డి

నాకు ఉన్న రెండు ఎకరాల 30 గుంటల భూమి రిజర్వాయర్‌లో పోతుంది. ప్రభుత్వం అందించే అరకొర నష్టపరిహారంతో ఒక ఎకరా భూమిని కూడా కొనలేని పరిస్థితి. రిజర్వాయర్ నిర్మాణంతో మా బతుకులు రోడ్డునపడతాయి. ప్రభుత్వం ఆలోచించి రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదనను వెనక్కితీసుకోవాలి.

ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎన్నిరోజులు ఉంటాయి..? : రైతు పాలకుర్ల ముత్తయ్య

రిజర్వాయర్ నిర్మించి ఇచ్చే నష్టపరిహారం డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి. మాకు ఉన్న మూడు ఎకరాల సాగుభూమి రిజర్వాయర్‌లో పోతే జీవనోపాధి ఎలా? తాతల కాలం నుంచి భూమిని సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నాం. వ్యవసాయం తప్ప మాకు ఏపని రాదు. ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణ ఆలోచనను వెనక్కి తీసుకోవాలి.

Next Story