- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అజాగ్రత్తగా ఉండొద్దు.. హెడ్ రెగ్యులేటర్ల ఆపరేషన్ ముఖ్యం
పంప్ హౌస్‌లలోకి నీటి ప్రవాహాన్ని, వరద నీటిని నియంత్రించే హెడ్ రెగ్యులేటర్ల ఆపరేషన్ చూసుకోవాలని.. వాటి నిర్వహణ అత్యవసరమని నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ జి.అనిల్‌కుమార్ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పంప్ హౌస్‌లలోకి నీటి ప్రవాహాన్ని, వరద నీటిని నియంత్రించే హెడ్ రెగ్యులేటర్ల ఆపరేషన్ చూసుకోవాలని.. వాటి నిర్వహణ అత్యవసరమని నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ జి.అనిల్‌కుమార్ సూచించారు. ఇటీవల ఈఎన్సీ జనరల్‌తోపాటు మరో 13 మంది అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను, పంప్‌హౌస్‌లను సందర్శించారు. అక్కడి పరిస్థితి అంచాన వేసి.. దానిపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. అందులో అధికారుల బృందం పలు కీలక సూచనలు చేసింది. వర్షాకాలం నేపథ్యంలో మరమ్మతులు చేసే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా.. పంప్ హౌస్‌ల భద్రతకు, భవిష్యత్తులో వరద ముంపును నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని హెడ్ రెగ్యులేటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని.. వాటి హోయిస్టులు, బుష్‌లు, బేరింగ్‌లకు సకాలంలో లూబ్రికేషన్ చేయాలని సూచించారు. రబ్బరు సీల్స్‌ను వెంటవెంటనే పరిశీలించి, అవి అరిగిపోయినా లేదా పాడైపోయినా వెంటనే మార్చాలని పేర్కొన్నారు. 2021-22 వరదలలో అన్నారం పంప్ హౌస్ రెండుసార్లు, మేడిగడ్డ పంప్ హౌస్ ఒకసారి మునిగిపోయిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకోవడంలో అజాగ్రత్తగా ఉండొద్దని పేర్కొన్నారు.
అన్నారం పంప్‌హౌస్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి
అన్నారం పంప్‌హౌస్ వద్ద వరద రక్షణ చర్యలు తక్షణమే పూర్తి చేయాలని అధికారులు సూచించారు. చందనపూర్ వాగు నుండి అన్నారం పంప్‌హౌస్‌కు నిరంతరం వరద ముప్పు పొంచి ఉందని.. ఈ ముప్పును నివారించడానికి, రక్షణ గోడ మిగిలి ఉన్న భాగాన్ని ప్రాధాన్యత ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పంప్‌హౌస్‌ను వరదల నుండి రక్షించడానికి అత్యవసరమని పేర్కొన్నారు. అన్నారం పంప్‌హౌస్ ప్రెజర్ మెయిన్స్‌ను వరదల సమయంలో నీటితో నింపి ఉంచాలని పేర్కొన్నారు. నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల గేట్లను సరిగ్గా లూబ్రికేట్ చేయాలని సూచించారు. బ్యారేజ్ పియర్లపై ఒత్తిడిని నివారించడానికి వరదల సమయంలో ఈ గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సైట్లలో లూబ్రికేషన్ రిజిస్టర్‌తో సహా అన్ని రిజిస్టర్‌లను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. సంబంధిత నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది లూబ్రికేషన్ రిజిస్టర్‌లను మెయింటెన్ చేయాలని సూచించారు. ఈ తనిఖీలో చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) కె.సుధాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఇరిగేషన్ సర్కిల్ ఎస్.సత్యనారాయణ సహా 12 మంది ఇతర అధికారులు పాల్గొన్నారు.






