ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీలో అక్రమాలు.. ఫేక్ సర్టిఫికెట్లతో మార్కులు కల్లగొడుతున్న వైనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-25 01:33:08  IST  )

రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) చేపట్టిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీలో అక్రమాలు.. ఫేక్ సర్టిఫికెట్లతో మార్కులు కల్లగొడుతున్న వైనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) చేపట్టిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించిన 20 శాతం సర్వీస్ వెయిటేజీ నిబంధనను ఆసరాగా చేసుకొని అనర్హులు ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధం లేని విభాగాల్లో పనిచేసినా.. ఫేక్ సర్టిఫికెట్లతో మార్కులు కొల్లగొట్టారని అర్హులైన అభ్యర్థులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

20 పాయింట్ల వెయిటేజీ..

ఎంహెచ్ఎస్ఆర్బీ 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం వంద మార్కుల్లో 80 మార్కులు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు, 20 మార్కులను ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారికి కేటాయించింది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రతి ఆరు నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రతి ఆరు నెలల సర్వీసుకి రెండు పాయింట్లు చొప్పున గరిష్టంగా 20 పాయింట్ల వెయిటేజీని నిర్ణయించింది. అయితే అభ్యర్థి గతంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తేనే ఆ పోస్టుకు వెయిటేజీ లభిస్తుందని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థలు లేదా పథకాల్లో పనిచేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. నోటిఫికేషన్‌లో సూచించిన ఫార్మాట్ లో ఉన్న అనుభవ ధ్రువీకరణ పత్రాలను మాత్రమే అంగీకరిస్తారు. ఈ పత్రాలను సంబంధిత అధికారులు జారీ చేయాల్సి ఉంటుంది. వెయిటేజీ మార్కులను లెక్కించడానికి నోటిఫికేషన్ వెలువడిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు.

కౌన్సెలింగ్‌లో వెలుగులోకి..

ఈ పోస్టుల కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించారు. ఏడు జోన్ల పరిధిలో మొత్తం 1284 పోస్టులను భర్తీ చేసేందుకు 2024 లో చేపట్టిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 20న చార్మినార్, 21న జోగులాంబ, యాదాద్రి, రాజన్న జోన్ల పరిధిలో, 22న భద్రాద్రి, బాసర, కాళేశ్వరం జోన్ల పరిధిలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ ప్రక్రియలో అనర్హులకు ఉద్యోగాలు దక్కాయంటూ పరీక్ష రాసి ఉద్యోగాలను పొందలేకపోయిన పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంహెచ్ఎస్ఆర్బీ ఉన్నతాధికారులకు సైతం ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

ఫేక్ సర్టిఫికెట్ల ఆరోపణలు..

నిబంధనలను ఏమార్చి పలువురు అభ్యర్థులు ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లతో వెయిటేజీ మార్కులు పొంది తమ ఉద్యోగాలు కొల్లగొట్టారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్, ఆర్టీపీసీఆర్ సైంటిస్ట్, టీ హబ్ మేనేజర్, ల్యాబ్ అటెండెంట్స్, సహా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధం లేని వాళ్లు కూడా ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ తో 20శాతం వెయిటేజీ మార్కులు పొంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొంటున్నారు. కరోనా సమయంలో తాత్కాలిక పద్ధతిలో నియమితులైన వారు కూడా ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలకు ఎంపికయ్యారని, నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం వారి ఎంపిక కూడా అక్రమమేనని అంటున్నారు. ఆధారాలతో సహా దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. రిక్రూట్ మెంట్ నిబంధనలను తుంగలో తొక్కి తప్పుడు మార్గంలో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

Next Story