జీ ప్లస్ టు అనుమతుల్లో అవకతవకలు.. శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల దూకుడు?

by Ramesh Naini |

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి అధికారులు బరితెగిస్తున్నారు. తప్పు చేసిన శిక్షలు లేకపోవడంతో అడిగే వారు లేరనే ధీమా ఎక్కువైంది.

జీ ప్లస్ టు అనుమతుల్లో అవకతవకలు.. శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల దూకుడు?
X

దిశ, శేరిలింగంపల్లి : ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి అధికారులు బరితెగిస్తున్నారు. తప్పు చేసిన శిక్షలు లేకపోవడంతో అడిగే వారు లేరనే ధీమా ఎక్కువైంది. అందిన కాడికి దండుకొని అందలం ఎక్కలనుకుంటున్నారు. అక్రమ సంపాదనతో మేనేజ్ చేయాలనుకుంటున్నారో అంతుచిక్కడం లేదు. ఏసీబీ రైడ్లు జరిగినా.. ఇంటెలిజెన్స్ నిఘా ఉన్న డోంట్ కేర్ అంటున్నారు. సీఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ సొంత లాభం కోసం ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి ఎసరు పెడుతున్నారనే ఆరోపణలే వస్తున్నాయి. జోనల్ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ రద్దు చేయడంతో వ్యవహారం మరింత ముదిరింది. శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల బరితెగింపు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మార్ట్ గేజ్ దందా..

మార్టిగేజ్ మినహాయింపుల పేరుతో భారీ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసింది. 210 గ‌జాలకు మించిన స్థ‌లంలో ఇల్లు నిర్మించాలంటే కచ్చితంగా నిర్మాణం లో కొంత భాగాన్ని సీఎంసీ పేరిట మార్టిగేజ్(తనఖా) చేయాల్సిందే. అందుకు తగ్గట్టు ఫీజు కూడా భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణం ఐతే ఇంకా ప్రభుత్వానికి ఆదనపు ఆదాయం వస్తుంది. చట్టబద్ధంగా అదనపు అంత‌స్థు నిర్మాణం చేయాలంటే టీడీఆర్‌ల‌ ఫీజులు ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.. అయితే ఇక్కడ నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి నయవంచనకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. ఇందు కోసం నయా గేమ్‌కు తెర లేపారు. అదే మార్ట్ గేజ్‌కు చిక్కని మహా జాదూ మంత్రం.

ఇది ఎలా సాధ్యం అంటే..

మంజూరు చేసిన అనుమతుల ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రిలీజ్ అవుతుంది. సెట్ బ్యాక్ నిబంధనలకు భిన్నంగా నిర్మాణం చేపడితే భవనంలోని కొంత భాగం సీఎంసీ పేరిటే తనఖాలో ఉండి పోతుంది. ఆ భాగాన్ని ఇతరులకు విక్రయించడానికి వీలుండదు. ఈ క్రమంలో మార్టిగేజ్ ను తప్పించుకోవడం అదే విధంగా పెద్ద మొత్తంలో ఫీజులు ఎగ్గొట్టడమే లక్ష్యంగా నిర్మాణదారులు తెలివిగా వ్యవహరిస్తారు. మార్ట్ గేజ్ నుంచి తప్పించుకునేందుకు ఒకే స్థలానికి 200 గజాల లోపు విభజించి ‘జీ ప్లస్ టు’ అనుమతులను పొందుతున్నారు. నిర్మాణం సమయంలో అనుమతులను కాస్త తుంగలో తొక్కి 7,8 అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారు. గచ్చిబౌలి జే వీ హిల్స్ లో ఓ బిల్డర్ కు 960 గజాల స్థలం ఉంది. రోడ్డు విస్తీర్ణం బట్టి 5 అంతస్తుల పైబడి అనుమతి లభిస్తుంది. సెట్ బ్యాక్ లు వదలాలి.. వీటన్నిటి నుంచి తప్పించుకునేందుకు నాలుగు ఫ్లాట్లుగా విభజించి అనుమతులు తీసుకున్నట్లు తెలిసింది. అన్నీ కలిపి భారీ భవనాన్ని సెల్లార్ తో పాటు ఏడు అంతస్తులు నిర్మించారు. ఇందుకోసం రూ.18 లక్షలు చేతులు మారినట్లు సమాచారం. ఇదే కాలనీలో లెటర్ నెంబర్ 450865/ జీహెచ్ఎంసీ/ 18893/2024, నార్నే ఏస్టేట్ రోడ్ లో, ఆల్ ఇండ్ కంపెనీ కాలనీలో, ప్రశాంత్ కాలనీ ఇలా అనేక చోట్ల ఈ తరహా అనుమతులకు గతంలో పని చేసి సెలవు పై వెళ్లిన డిప్యూటీ కమిషనర్, ప్రస్తుత ఏసీపీ, రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్న టీపీఎస్, చైన్ మన్ ముఠాగా ఏర్పడి సుమారు 25 ఆక్యుపెన్సీ, మార్ట్ గేజ్ తప్పించుకునేందుకు అవకాశం ఉన్న అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

రెండంతస్తులకే అనుమతి..

రెండంతస్తులకే అనుమతి పొంది ఏకంగా 7,8 అంతస్తుల నిర్మాణం చేపట్టేలా సహకరించారు. అధికారికంగా అలాంటి నిర్మాణాలు చేపట్టాలనుకుంటే భారీ మొత్తంలో ఫీజులు చెల్లించడం తోపాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కు దూరం అవ్వాల్సి వస్తుంది. వీట‌న్నింటికి తోడు భూ సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు, స్ట్ర‌క్చ‌ర‌ల్ డిజైన్స్‌, స్టెబిలిటీ స‌ర్టిఫికేట్‌, ఫైర్ సేఫ్టీ ఇలా అనేక నిబంధ‌న‌లు త‌ప్ప‌ని స‌రిగా పాటించాల్సి వ‌స్తుంది. వాటన్నింటినీ మినహాయింపు పొంది మంత్ర దండమే టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తుంది.

అవినీతికి పరాకాష్ట..

ప్రస్తుతం మాదాపూర్ సర్కిల్ పరిధిలో కి మారిన అంజయ్య నగర్, సిద్దిక్ నగర్ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి పరాకాష్టకు చేరింది. ఏసీబీ వెంకటరమణ హయాంలోనే సిద్దిక్ నగర్ లోని ఒక అక్రమ భవనం నిర్మాణంలో నాణ్యత లోపం, అదనపు అంతస్తుల కారణంగా నేలకొరకగా.. దాన్ని సాకుగా చూపి ఈ ప్రాంతంలో ని దాదాపు 30 భవనాలను సీజ్ చేశాడు. అనంతరం ఒక్కో భవనం వద్ద లక్షల వరకు వసూలు చేసి దొడ్డిదారిలో వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

మరీ ఇంత బరితెగింపా..?

శేరిలింగంపల్లి సర్కిల్ ఏసీపీ, టీపీఎస్ పని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నదే అక్రమ నిర్మాణాలను నియంత్రించడానికి.. ఐతే ఇక్కడ వారి విధి నిర్వహణ గాలికి వదిలేశారని ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. శ్రీరాంనగర్ కాలనీలో భవిష్యత్తు కా ర్పొరేటర్లగా ప్రకటించుకున్న ఇద్దరు బిల్డర్లు జోలికి వెళ్లమంటూ ఓ చైన్‌మన్ తెగేసి చెబుతున్నారు. ఇలాంటి అనేక మంది బిల్డర్‌లకు అధికారులు మినహాయింపు ఇవ్వడంపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story