అడుగడుగునా అక్రమాలే.. కార్మిక శాఖలో అధికారుల ‘వాటాల’ దందా!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 01:36:12  IST  )

తెలంగాణ కార్మిక శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా అక్రమాలే.. కార్మిక శాఖలో అధికారుల ‘వాటాల’ దందా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్మిక శాఖలో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పెద్ద ఆఫీసర్లే దొరికిందళ్ల దోచుకోవడంతో కింది స్థాయి అధికారులు సైతం తమ శక్తి మేరకు వెనకేసుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్‌లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నదని ప్రచారం. అక్కడ ప్రతి కొనుగోళ్ల వెనుక ఆఫీసర్ల హోదా మేరకు పర్సంటేజీలు ముట్టచెప్పడం ఓ ఆనవాయితీగా వస్తున్నట్టు కార్మిక శాఖ వర్గాల్లో టాక్. అలాగే, కార్మికుల సంక్షేమ బోర్డులోనూ అవినీతి భారీగా జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నేరుగా పెద్ద సార్ల ప్రమేయం!

కార్మిక శాఖ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ పనిచేస్తుంటుంది. ఈ విభాగం కింద ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు కొనసాగుతాయి. అక్కడ కావాల్సిన మందులు, ఇంజెక్షన్లు, థియేటర్ ఆపరేషన్లకు కావాల్సిన పరికరాలను కొనుగోలు చేస్తుంటారు. కార్మిక శాఖలోని కీలక అధికారులు టెండర్ ప్రక్రియలో నేరుగా కల్పించుకుని తమకు అనుకూలమైన ఏజెన్సీలకు అవి దక్కేలా నిబంధనలు తయారు చేయడం ఓ తంతుగా మారిందని ప్రచారం జరుగుతున్నది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున కీలక ఆఫీసర్లకు వాటాలు ఇస్తుంటారని టాక్. ఒకవేళ ఇతర ఏజెన్సీలు పనులు దక్కించుకుంటే బిల్లులు రిలీజ్ చేసే సమయంలో సదరు అధికారులు ఇబ్బందులు పెట్టి, తమకు కావాల్సిన వాటాను పొందిన తర్వాతే బిల్ క్లియర్ చేస్తుంటారని ప్రచారం జరుగుతున్నది. ఇకపోతే కొందరు ఆఫీసర్లు మామూళ్లు వసూలు చేసేందుకు మధ్యవర్తులను సైతం నియమించుకున్నట్టు కార్మిక శాఖ వర్గాల్లో టాక్. ‘ఇక్కడ కొన్ని ఏజెన్సీలే పనిచేస్తుంటాయి. కొత్తవాళ్లు రావడం అంత తేలిక కాదు. పనులు దక్కించుకునేందుకు ఏజెన్సీలే ఆఫీసర్లకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముందు ఆఫీసర్లు నో అంటారు. ఆ తర్వాత అందరూ సర్దుకుంటారు. కిందిస్థాయి అధికారులకూ ఎంతో కొంత ముట్టచెప్తారు’ అని ఆ సంస్థలో రిటైర్ అయిన ఓ ఆఫీసర్ వివరించారు.

పదేండ్లుగా ఇదే తంతు..

కార్మిక శాఖలో అవినీతి కొత్తేమీ కాదని, రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆ శాఖను పట్టి పీడిస్తున్నదనే చర్చ జరుగుతున్నది. ఆ శాఖ బాధ్యతలు తీసుకునే ముందు అధికారులు దానిని పనిష్మెంట్ జాబ్‌గా భావిస్తారని పేరుంది. కానీ, అక్కడ మామూళ్లకు అలవాటు పడిన తర్వాత ఆ శాఖ నుంచి బదిలీ అయ్యేందుకు ఇష్టపడరని టాక్. బీఆర్ఎస్ హయాంలో ఓ సీనియర్ ఆఫీసర్‌‌ను అక్కడికి కావాలని నాటి ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ అక్కడ ఉన్న స్పెషల్ ట్రీట్‌మెంట్ చూసి ఆయన.. అక్కడే మరింత కాలం పనిచేయాలని కోరుకున్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లు సైతం ఆ శాఖలో జరిగేదంతా చూసి అక్కడే మరింత కాలం ఉంటే బాగుండు అని ఫీలయ్యారని తెలిసింది. కానీ, ప్రభుత్వం ఇతర శాఖలకు వారిని బదిలీ చేయడంతో తెగ ఫీలయ్యారని టాక్. కొన్నేళ్లుగా కార్మిక శాఖలో జరుగుతున్న అక్రమాల దందాకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ ఈ మధ్య ప్రభుత్వానికి కొందరు కార్మికులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

‘సెస్’ ఫండ్స్‌కు నో ఆడిట్..

కార్మికశాఖ పరిధిలోని భవన నిర్మాణ సంక్షేమ బోర్డు సైతం అక్రమాలకు అడ్డగా మారిందని ప్రచారం ఉంది. బోర్డు పరిధిలోని సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? అర్హులైన కార్మికులకే అందుతున్నాయా? ఏమైన అక్రమాలు జరుగుతున్నాయా? అనే ఆడిటింగ్ లేకపోవడంతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. భవన నిర్మాణ కార్మికులను అసంఘటిత రంగం కార్మికులుగా గుర్తించిన ప్రభుత్వం, వారి సంక్షేమం కోసం రూ.10 లక్షలకు మించిన విలువ ఉన్న నిర్మాణంలో ఒక శాతం సెస్‌ను ప్రభుత్వం వసూలు చేస్తున్నది. ఆ విధంగా ప్రతిఏటా సుమారు రూ.900 కోట్లు సంక్షేమ బోర్డు ఖాతాలో జమ​అవుతున్నట్టు తెలిసింది. ఆ సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీతో ప్రమాదంలో గాయపడిన, మరణించిన కార్మికులకు ఆర్థిక సాయం అందించాలి. కానీ, కీలక హోదాలోని అధికారులు, కిందిస్థాయి ఆఫీసర్లు కలిసి తప్పుడు వ్యక్తుల పేరిట ప్రతిఏటా పెద్ద ఎత్తున సొమ్మును విత్ డ్రా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

Next Story