HYD: రైల్వే సిగ్నలింగ్‌లో దేశాన్ని తీర్చిదిద్దుతున్న ఇరిసెట్

by Gantepaka Srikanth |

ఏడాదికి సగటున 5,300 రైల్వే అధికారులు, పర్యవేక్షకులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్స్.

HYD: రైల్వే సిగ్నలింగ్‌లో దేశాన్ని తీర్చిదిద్దుతున్న ఇరిసెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాదికి సగటున 5,300 రైల్వే అధికారులు, పర్యవేక్షకులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్స్. ఇరిసెట్‌గా పేరుగాంచిన ఈ సంస్థ నగరంలోని తార్నాకలో ఉంది. రైల్వే వ్యవస్థలో ప్రవేశాలకు యూపీఎస్సీ ద్వారా నిర్వహించే ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా, ఆర్ఆర్బీ పరీక్షల ద్వారా ఎంపికై నూతనంగా నియమించిన వారికీ శిక్షణ ఇస్తుందీ సంస్థ. ఇప్పటి వరకు 1,20,549 మంది రైల్వే అధికారులు, సిబ్బందికి ఈ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ ఇచ్చింది. రైల్వే సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ రంగాలలో శిక్షణ ఇవ్వడంలో దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న 8 శిక్షణా సంస్థలలో ఒకటి. ప్రస్తుతం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా తీసుకొచ్చిన ఆధునిక రైల్వే ప్రొటెక్షన్ సిస్టమ్ తయారు చేసిన సంస్థగా ఇరిసెట్ ఎంతో గుర్తింపు పొందింది. పాత సిగ్నలింగ్ నుంచి నేటి కవచ్ వరకు ఈ సంస్థ ప్రాధాన్యమెంతో ఉంది. రైల్వే సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్ ఇంజినీర్లను తయారు చేయడంలో ఇరిసెట్ ఇచ్చే శిక్షణ దేశవిదేశాల్లో పేరెన్నికగన్నది. ఇప్పుడు రైల్వేలో అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థ కవచ్‌కు సైతం ఇరిసెట్ కీలకంగా మారింది. ఈ నెల 24న 68వ వార్షికోత్స వాన్ని జరుపుకోనున్న ఇరిసెట్ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

కవచ్ టెక్నాలజీలో కీలక పాత్ర

స్వదేశీ రైల్ రక్షణ సాంకేతికత ‘కవచ్’ అమలు, పరిశోధన, ఫీల్డ్ శిక్షణలో ఇరిసెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. 2022లో ఇక్కడ కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించారు. కవచ్ సాంకేతికత విస్తరణ కోసం సలహాలను ఇరిసెట్ అందిస్తూ ప్రమాదాలను అరికడుతూ ప్రయాణికుల ప్రాణాలకు భరోసానిస్తోంది. అంతర్జాతీయంగా సైతం శిక్షణ అందిస్తూ మలేషియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి 332 మంది విదేశీ ట్రైనీలకు శిక్షణనిచ్చింది. 1957లో స్థాపితమైన ఇరిసెట్... రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్ టెక్నాలజీలలో దేశంలోనే ఎంతో కీలకమైనది. అవుట్‌డోర్ సిగ్నలింగ్, ట్రైన్ డిటెక్షన్, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్, ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, బ్లాక్ సిగ్నలింగ్, టెలీఫోనీ, నెట్‌వర్కింగ్ వంటి విభిన్న విభాగాలలో ఇరిసెట్‌లో 11 ప్రయోగశాలలు ఉన్నాయి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్ఎల్) రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఆర్‌సీఐఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, మెట్రో రైల్వేస్ ప్రతినిధులు సైతం ఇరిసెట్‌లో ఆధునిక సాంకేతికతలపై శిక్షణ పొందాల్సిందే.

ఇస్రో చైర్మన్ హాజరు

ఇరిసెట్ 68వ వార్షికోత్సవం సందర్భంగా తార్నాకలోని కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. రైల్వే ఆధునీకరణ, ఆవిష్కరణ, రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్ల భవిష్యత్తు అభివృద్ధిపై రైల్వే శాఖకు చెందిన కీలక అధికారులు ప్రసంగిస్తారు. రైల్వే సిగ్నలింగ్ టెక్నాలజీ, మానవ వనరుల అభివృద్ధిలో ఇరిసెట్ కీలక సంస్థగా నిలుస్తోందని.. ఇప్పుడు సంస్థ 68వ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని ఇరిసెట్ డీజీ శరద్ కుమార్ శ్రీవాస్తవ దిశకు తెలిపారు.

Next Story