భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌లకు చుక్కెదురు.. ధర్మాసనం సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-30 07:46:28  IST  )

భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాకు హైకోర్టులో చుక్కెదురైంది.

భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌లకు చుక్కెదురు.. ధర్మాసనం సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులకు చెందిన భూదాన్ భూములను ఈనెల ఏప్రిల్ 27 నుంచి నిషేధిత జాబితాలో పెట్టాలని ఏప్రిల్ 24న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆదేశాలను సవాలు చేస్తూ ఆ ముగ్గురు ఐఏఎస్‌లు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేసులో తదుపరి వాదనలు కూడా సింగిల్ బెంచ్‌‌‌లోనే వినిపించాలని ఐపీఎస్ తరఫు న్యాయవాదులను ఆదేశించింది.

అయితే, మహేశ్వరం మండల పరిధిలోని నాగారంలో సర్వే నెంబర్ 194లో ఉంది పట్టా భూమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనానికి విన్నివించారు. పిటిషనర్ అభ్యర్థనకు మించి ఉపశమనం కల్పిస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా పిటిషన్‌ ఉపసహరించుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని రిజిస్ట్రీని సింగిల్ బెంచ్ ఆదేశించే అధికారం లేదని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేసులో తదుపరి వాదనలు కూడా సింగిల్ బెంచ్‌‌‌లోనే వినిపించాలని ఐపీఎస్ తరఫు న్యాయవాదులకు సూచించింది.

కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్​ 181, 182, 194, 195లోని భూదాన్​ భూములు అన్యాక్రాంతం అయినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అందులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నాగారంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఉన్నతాధికారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బినామీ లావాదేవీలతో చట్టవిరుద్ధంగా భూదాన్​భూములను బదలాయించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా భూదాన్ చట్ట, తెలంగాణ భూదాన, గ్రామదాన నిబంధనలు-1965కు విరుద్ధంగా పలువురు ఐఏఎస్‌‌‌‎లు, ఐపీఎస్‌‎లు సొంత పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని తెలిపారు. మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. అయితే ఆ పిటిషన్‌పై 2025, ఏప్రిల్ 24న జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్​ 181, 182, 194. 195లోని భూదాన్​ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు సబ్‌ రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేశారు.

Next Story