‘కోర్' బిల్లు–2026 ముసాయిదా విడుదల.. ప్రజాభిప్రాయానికి అవకాశం

by Prasad Jukanti |

జీహెచ్‌ఎంసీ స్థానంలో క్యూర్ బిల్లు 2026 ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. జూలై 24 వరకు సూచనలకు అవకాశం కల్పించింది.

‘కోర్ బిల్లు–2026 ముసాయిదా విడుదల.. ప్రజాభిప్రాయానికి అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ మహానగర ప్రాంతంలో పట్టణ పరిపాలనను పూర్తిగా ఆధునీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026’ (క్యూర్ బిల్లు) ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 1955 నాటి పాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చట్టం స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. హైదరాబాద్ జనాభా 15 లక్షల నుంచి ప్రస్తుతం 1.3 కోట్లకు పెరిగిన నేపథ్యంలో, కాలానుగుణ అవసరాలకు తగ్గట్టుగా ఈ సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు ద్వారా జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమగ్ర పాలనా వ్యవస్థలోకి తీసుకురాబోతున్నారు. మెట్రో స్థాయిలో సమన్వయంతో పాటు కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పరిపాలనను కొనసాగించే విధానాన్ని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

జులై 24 వరకు అభిప్రాయాలకు అవకాశం:

ఈ ముసాయిదా బిల్లును పౌరులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs), పరిశ్రమల ప్రతినిధులు, వృత్తి నిపుణులు మరియు ఇతర భాగస్వామ్య వర్గాల సూచనల కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ముసాయిదా బిల్లును పరిశీలించి తమ విలువైన సూచనలు 24 జూలై 2026 లోపు పంపించాలని కోరారు. ముసాయిదా బిల్లు మరియు సూచనలు సమర్పించేందుకు https://ghmc.gov.in/categoryWiseInsertReport.aspx సందర్శించాలని అధికారులు తెలిపారు. అందిన సూచనలు పరిశీలించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజాకేంద్రీకృత పట్టణ పాలన వ్యవస్థను రూపొందించే దిశగా తుది బిల్లులో పరిగణనలోకి తీసుకోబడతాయని స్పష్టం చేశారు.

జీహెచ్​ఎంసీ చట్టంలోని కొనసాగింపు అంశాలు :

* కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డ్ కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తి పన్ను పరిపాలన, రుణాల సేకరణ అధికారాలు, జంతు సంరక్షణ వంటి ప్రధాన నిబంధనలు కొనసాగుతాయి.

* మున్సిపల్ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్ సభ్యునికి ప్రాతినిధ్యం కల్పించడం.

* కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను తొలగించడం.

ముఖ్య సంస్కరణలు :

ఆస్తి పన్ను:

* వార్షిక అద్దె విలువ విధానానికి బదులుగా మూలధన విలువ (క్యాపిటల్​ వాల్యూ ) ఆధారిత విధానం.

* ఆక్ట్రాయ్, కుక్క పన్ను (డాట్​ టాక్స్​ ) రద్దు.

* స్వీయ అంచనా (సెల్ఫ్​ అసెస్​మెంట్​ ) విధానం ప్రవేశపెట్టడం.

* సమగ్ర ఆస్తి గుర్తింపు కోడ్ (ఇంటిగ్రేటెడ్​ ప్రాపర్టీ ఐడెంటి కోడ్​ ).

* సమయానికి పన్నులు చెల్లించే వారికి రాయితీలు.

వ్యాపార సౌలభ్యం, మౌలిక వసతులు :

* జీఐఎస్​ ఆధారిత వీధుల అభివృద్ధి ప్రణాళికలు.

* యూనివర్సల్ డిజైన్ ప్రమాణాలు.

* భూగర్భ యుటిలిటీ వ్యవస్థలు.

* భవనాల నిర్మాణాలకు డీమ్డ్ అప్రూవల్ విధానం.

* చిన్నపాటి ఉల్లంఘనలకు క్రిమినల్ చర్యల బదులుగా దశలవారీ సివిల్ జరిమానాలు.

* అన్ని వ్యాపారాలకు ఒకే ట్రేడ్ లైసెన్స్.

* నైట్ ఎకానమీకి ప్రత్యేక విధానం.

ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం :

* ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక అధికారాలు.

* ప్రజా ఇబ్బందుల పరిష్కార వ్యవస్థ సరళీకరణ.

* మాన్యువల్ స్కావెంజర్స్ చట్టానికి అనుగుణంగా పారిశుద్ధ్య వ్యవస్థ.

* నీటి సరఫరా, మురుగునీటి నియంత్రణ బాధ్యతలను జలమండలికి అప్పగించడం.

సమగ్ర పాలన కోసం కొత్త సంస్థలు

* ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్​ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు.

* చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం హైడ్రాకు ప్రత్యేక బాధ్యతలు.

* విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, వాతావరణ మార్పు చర్యలు, వారసత్వ పరిరక్షణ, ఆహార భద్రత, లింగ సమానత్వం, కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక సంస్థలు.

డిజిటల్ , పౌర సేవలు :

* అత్యవసర సమన్వయం మరియు బహుళ సంస్థల పర్యవేక్షణ కోసం క్యూర్​ స్మార్ట్​ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు.

* సమగ్ర డిజిటల్ పోర్టల్.

* ఒకే సమీకృత యుటిలిటీ బిల్లు.

* ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం క్యూర్ అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు.

ప్రజలు, నిపుణులు మరియు అన్ని వర్గాల భాగస్వాములు ఈ ముసాయిదా బిల్లుపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది.

Next Story