ఒకే నంబర్ ప్లేట్‌తో మూడు వాహనాలు.. చట్టాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం భగ్నం

by Kodari Anjali |

ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌ను మూడు వేర్వేరు ద్విచక్ర వాహనాలకు ఉపయోగిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం చేస్తున్న ముఠాను చార్మినార్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

ఒకే నంబర్ ప్లేట్‌తో మూడు వాహనాలు.. చట్టాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం భగ్నం
X

దిశ, చసంపాపేట్: ట్రాఫిక్ చలాన్లు, ఫైనాన్స్ సంస్థల రికవరీ చర్యలు, పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌ను మూడు వేర్వేరు ద్విచక్ర వాహనాలకు ఉపయోగిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం చేస్తున్న ముఠాను చార్మినార్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, ఒకే నంబర్ ప్లేట్‌తో నడుపుతున్న మూడు హోండా యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం వరసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా భీమ్ అజయ్ రెడ్డి అనే వ్యక్తి నడుపుతున్న హోండా యాక్టివాను పరిశీలించింది. వాహనం ఇంజిన్, ఛాసిస్ నంబర్లు రిజిస్ట్రేషన్ వివరాలతో సరిపోలకపోవడంతో పోలీసులు లోతుగా విచారించగా అసలు మోసం వెలుగులోకి వచ్చింది. విచారణలో నకోటి మల్లికార్జున్ తన సొంత వాహనం TS09 FE 4997 రిజిస్ట్రేషన్ నంబర్‌కు నకిలీ నంబర్ ప్లేట్లు తయారు చేయించి, రిజిస్ట్రేషన్ చేయని ఫైనాన్స్ వాహనాలకు అమర్చినట్లు తేలింది.

చర్యలను తప్పించుకునేందుకు...

ఇండస్‌ఇండ్ బ్యాంకుకు సుమారు రూ.36 వేల బకాయి ఉండటంతో ఫైనాన్స్ సంస్థ వాహనాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు ఈ పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా అదే నంబర్ ప్లేట్‌ను మరో హోండా యాక్టివాకు కూడా అమర్చించి తన స్నేహితుడు కొప్పుల ధనరాజ్‌కు వినియోగించేందుకు ఇచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ విధంగా ముగ్గురు కలిసి ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌తో మూడు వేర్వేరు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ చలాన్లు, పోలీసుల తనిఖీలు, ఫైనాన్స్ సంస్థల చర్యలను తప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై వరసిగూడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.243/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(2) కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసును చార్మినార్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సైదాబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు కె. రామారావు, ఎం. మహేష్, ఎం. మధు, పీసీ ఎన్. లక్ష్మణ్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, వరసిగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ఛేదించారు.

Next Story