చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి.. రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 07:37:44  IST  )

చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది.

చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి.. రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. ఈ మేరకు 2005 నుంచి 2020 మధ్య కాలంలో జరిగిన అవకతవకలపై గోల్కొండ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ నవంబర్ 27న అందుకు సంబంధించిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన 15 మందిని బాధ్యులుగా చేస్తూ.. తుది నివేదిక వెలువడింది. వారిలో చిత్రపురి కాలనీ మాజీ ప్రెసిడెంట్లు కొమర వెంకటేశ్, నటుడు బినోద్ బాల, మాజీ సెక్రటరీ కృష్ణ మోహన్, మాజీ ట్రెజరర్, నటుడు పరుచూరి వెంకటేశ్వర రావు, ఎంసీ మెంబర్లు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కె. రాజేశ్వర రావు, దేవినేని బ్రహ్మానంద రావు, చంద్రమధు, కె. ఉదయ భాస్కర్, జె. రామయ్య, నటుడు కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని, ఎ. మహానంద రెడ్డి, రఘు బత్తుల, ప్రవీణ్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ మేరకు బాధ్యుల నుంచి రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని.. అటు ప్రభుత్వానికి, ఇటు రిపోర్టులో పేర్లు ఉన్న 15 మందికి గోల్కొండ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ నివేదిక కాపీని పంపారు.

కాగా, చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ గతంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే, కమిటీలోని మరికొందరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలను ఇటీవల 2024, ఆగస్టులో అధికారులు కూల్చివేశారు. జీ ప్లస్ 1 అనుమతికి బదులుగా జీ ప్లస్ 2, జీ ప్లస్ 3 నిర్మాణాలు చేపట్టారని, అనుమతి పొందిన విల్లాల కంటే అదనపు విల్లాలు నిర్మించారని అధికారులు గుర్తించారు. ఇందులో రూ.300 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, అల్పాదాయ వర్గాల సినీ కార్మికులకు కేటాయించాల్సిన ప్లాట్లను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

Next Story