తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరు కీలక నిందితులకు కస్టడీ

by Kema Shiva Kumar |

తిరుమల (Tirumala) కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరు కీలక నిందితులకు కస్టడీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరో ఇద్దరు కీలక నిందితులు A16 అజయ్ కుమార్ సుగంధ్, A29 సుబ్రహ్మణ్యంలను విచారణ నిమిత్తం ఇవాళ కస్టడీలోకి తీసుకుంది. ఈనెల 12 వరకు అంటే మూడు రోజుల పాటు కేసులో పలు కీలక విషయాలపై వారిని ప్రశ్నించి, వారిచ్చే స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 12కి చేరడంతో టీటీడీ ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, భోలేబాబా డెయిరీ (Bholebaba Dairy)కి సంబంధించిన కీలక వ్యక్తి అజయ్ కుమార్ సుగంధ్ (Ajay Kumar Sugandh) పూర్తిగా కెమికల్స్‌తో కల్తీ నెయ్యి తయారు చేసి, ఒక్క చుక్క కూడా పాలు కొనకుండా టీటీడీకి సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో ఇప్పటికే వెల్లడైంది. ఇక మరో నిందితుడు, మాజీ టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం (Subramanyam) అర్హత లేని డెయిరీలకు టెండర్లు కట్టబెట్టేందుకు రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. డెయిరీ యజమానుల నుంచి వెండి ప్లేట్, శాంసంగ్ ఫోన్, నగదు (రూ.3.5 లక్షలు) వంటి బహుమతులు అందుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మైసూరు ల్యాబ్ నివేదికలో భోలేబాబా కంపెనీ నెయ్యి కల్తీ అని తేలినా ఆ విషయాన్ని దాచిపెట్టి, సాంకేతిక కమిటీలో అనుకూల నివేదికలు ఇచ్చారని నిర్ధారించారు. దీంతో నిందితుడు సుబ్రహ్మణ్యంను తిరుపతిలో అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.

Next Story