తెలంగాణ మత్స్యకారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు

by Taduka Kalyani |

తెలంగాణ మత్స్యకారులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

తెలంగాణ మత్స్యకారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు
X

దిశ, తుర్కయంజాల్ : తెలంగాణ మత్స్యకారులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కోహెడలో 13 ఎకరాల లో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్ సేల్ చేపల మార్కెట్ ను మంత్రి వాకిటి శ్రీహరి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. దేశంలోనే సముద్రతీర ప్రాంతం కాకుండా అంతర్గత రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి ఆధునిక మంచినీటి చేపల ఎగుమతి కేంద్రంగా కోహెడ మార్కెట్ నిలవనుందని తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను విస్తరించడంలో ఈ కేంద్రం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మార్కెట్‌లో ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు, భారీ హోల్‌సేల్ మార్కెట్ వంటి అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రెండు వేల మంది వ్యాపారులు ఇక్కడ వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండగా, ఐదు వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు.

ఈ మార్కెట్ మత్స్యకారుల అభివృద్ధికి మైలురాయి

అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మార్కెట్ మత్స్యకారుల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని, బ్లూ రివల్యూషన్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మత్స్యకారులకు గిట్టుబాటు ధరలు, ఆధునిక మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, కోహెడలో నిర్మిస్తున్న ఈ మార్కెట్ తెలంగాణ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. విజయవాడ జాతీయ రహదారి, నాగార్జునసాగర్ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం చేపట్టడం వల్ల మత్స్యకారులు, ముదిరాజ్, బెస్త వర్గాలకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 13 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు తెలిపారు. అదనంగా మరో రూ.50 కోట్లు మంజూరు చేసి మొత్తం రూ.100 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, రంగారెడ్డి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు దూస వెంకటేష్, ఫిషరీస్ అదనపు డైరెక్టర్ మురళీకృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ, టి పి సి సి కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్, ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూధన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి,ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి, ఆదిభట్ల సర్కిల్ డీ సీ సత్యనారాయణ రెడ్డి, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు కోశిక ఐలయ్య, తుర్కయంజాల్ డివిజన్ అధ్యక్షులు ఓర్సు శ్రీనివాస్, నాయకులు వంగేటి గోపాల్ రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, కుంట గోపాల్ రెడ్డి, మత్స్యకారులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story