భారతీయ సంస్కృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-11 15:10:59  IST  )

భారతీయ సంస్కృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు.

భారతీయ సంస్కృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం
X
  • పులులు, చిరుతలు, సింహాలు సంరక్షణలో భారత్ మేటి
  • అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ సంస్కృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ‘షేర్డ్ స్ట్రైప్స్ – షేర్డ్ ఫ్యూచర్’ అంశంపై బిగ్ క్యాట్స్ సంరక్షణపై అంతర్జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ అటవీ శాఖ, భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) పరిధిలో పెద్ద పులుల సంరక్షణకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య సహకారం పెంపొందించడంపై ఈ వేదికలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మలేషియా తరఫున చెన్నై కాన్సుల్ జనరల్ సరవణ కుమార్ కుమారవాసం, రష్యా తరఫున చెన్నై కాన్సుల్ జనరల్ వాలెరి ఖొడ్జాయేవ్, శ్రీలంక తరఫున డిప్యూటీ హై కమిషనర్ గణేశనాథన్ గీతేశ్వరన్, థాయ్‌లాండ్ తరఫున రాయల్ థాయ్ కాన్సులేట్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ పోర్న్‌పున్ పుపియాంగ్‌జై పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ ప్రపంచ వన్యప్రాణి సంరక్షణలో భారత్ నాయకత్వాన్ని ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ను అభినందించారు. పులులు, చిరుతలు, సింహాలు, చీతాల సంరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తుచేశారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంతర్జాతీయ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల ప్రాధాన్యతను వివరించిన మంత్రి, గిరిజన సమాజాల పాత్రను కొనియాడారు. ఆవాసాల అభివృద్ధి, వేట నిరోధక చర్యలు, వన్యప్రాణి సంరక్షణ వల్ల రాష్ట్రంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

విదేశాల్లో వన్యప్రాణులు సంరక్షణ

వివిధ దేశాల ప్రతినిధులు తమ దేశాల్లో వన్యప్రాణుల సంరక్షణ, పెద్ద పులుల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. థాయ్‌లాండ్ ప్రతినిధి మాట్లాడుతూ నిరంతర ఆవాసాల సంరక్షణ, శాస్త్రీయ పర్యవేక్షణ, వేట నిరోధక చర్యల వల్ల తమ దేశంలో పులుల సంఖ్య దాదాపు 100 నుంచి 200కు పెరిగిందన్నారు. రష్యా ప్రతినిధి అమూర్ టైగర్ సంరక్షణకు సంబంధించి మంచు ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. శ్రీలంక ప్రతినిధి చిరుతల సంరక్షణ చర్యలపై మాట్లాడి, శాస్త్రీయ సహకారం, ఎక్స్‌సిటు కన్జర్వేషన్ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమన్నారు. మలేషియా ప్రతినిధి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ లక్ష్యాలను అభినందిస్తూ, ఈ వేదిక ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాల మార్పిడి, అంతర్జాతీయ సహకారం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల పరిశోధన, శాస్త్రీయ నిర్వహణ, సంరక్షణ పెంపకం, ఆవాసాల పునరుద్ధరణ, సిబ్బంది శిక్షణ, బిగ్ క్యాట్స్ ట్రాన్స్‌లోకేషన్ వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రపంచ స్థాయి సమన్వయ వేదికగా ఎదగాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.

పీసీసీఎఫ్ (CWLW) వినయ్ కుమార్ మాట్లాడుతూ పులుల సంరక్షణ, ఆవాసాల అభివృద్ధి, శాస్త్రీయ పర్యవేక్షణలో భారత్, తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. పీసీసీఎఫ్ & హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ డాక్టర్ సి. సువర్ణ మాట్లాడుతూ మానవ-వన్యప్రాణి ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆవాసాల అనుసంధానం, ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అమెరికా తరఫున హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పాల్గొని ఇటీవల కాజిరంగా నేషనల్ పార్క్ సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. భారతదేశ జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం భవిష్యత్ తరాల కోసం పెద్ద పులులు, జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్య పరిరక్షణకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రతినిధులు సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూ పార్కుల డైరెక్టర్ డాక్టర్ ఎస్. సునీల్ హిరేమత్‌, రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహారీ, అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఎం భగవత్, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, జూ డైరెక్టర్ సునీల్ హీరామత్, క్యూరేటర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

పులిపిల్లలను దత్తత తీసుకున్న గవర్నర్..

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రెండు పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. 9 నెలల వయసు కలిగిన ‘ఇషాన్’ అనే మగ పులి పిల్లతో పాటు ‘వన్యా’ అనే ఆడ పులి పిల్లను గవర్నర్ దత్తత తీసుకున్నారు. ఈ రెండు పులి పిల్లలు 30 జూలై 2025న జన్మించాయి. వీటి తల్లిదండ్రులు ‘ప్రభాస్‘ మరియు ‘మాల’ అనే పులులు. ఈ రెండు పులి పిల్లలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవలే నామకరణం చేయడం విశేషం.. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో గవర్నర్ ఈ దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూ అధికారులు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story