- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక బడిలోనే ఇంటర్ చదువు: ప్లస్ 2 అడ్మిషన్లకు కసరత్తు ప్రారంభం
తెలంగాణలో ప్లస్ టూ విద్యా విధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద 100 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే 11వ తరగతి తరగతులు ప్రారంభం కానున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ అకడమిక్ ఇయర్ (2026–27) నుంచే ప్లస్ టూ విద్యాబోధన అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ పద్దతిన100 ప్రభుత్వ స్కూల్స్ ను ఎంపిక చేసి11వ తరగతి అడ్మిషన్లు తీసుకుని, విద్యాబోధన చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకోసం కావాల్సిన విధివిధానాలను తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అందుకే ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూలును అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.
టెన్త్ పాసైన స్టూడెంట్స్‌కు అదే స్కూల్‌లో 11వ తరగతి
ఈసారి పదో తరగతి పాసైన స్టూడెంట్స్ జూనియర్ కాలేజీలకు వెళ్లకుండా, అదే స్కూల్స్ లో 11వ తరగతి బోధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 100 స్కూల్స్ ను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనితో టీచింగ్ స్టాప్ అందుబాటులో ఉన్న స్కూల్స్ ను ఎంపిక చేసే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మెజార్టీ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పనిచేస్తున్నాయి. అక్కడ టీచింగ్ స్టాప్ ను డిప్యూటేషన్ పద్దతిన 11వ తరగతి బోధించే స్కూల్స్ కు డిప్యూటేషన్ పద్దతిన సర్దుబాటు చేయడమా?లేకపోతే అదనపు స్టాప్ ఉన్న కాలేజీల నుంచి తాత్కాలికంగా కేటాయించడమా?అనే కోణంలో అధికారులు అన్వేషణ చేస్తున్నట్లు తెలిసింది.
లోటుపాట్ల తెలుసుకునేందుకే పైలెట్ ప్రాజెక్టు
జాతీయ విద్యావిధానం అనుగుణంగా రాష్ట్రంలో సైతం ప్లస్ టూ విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకోసం ఇంటర్ బోర్డు ప్రమేయం లేకుండా 12వ తరగతి వరకు ఒకే బోర్డు కింద విద్యాబోధన ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్లస్ టూ ను అమలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకని పైలెట్ పద్దతిన ఈ సారి ఎంపిక చేసిన వంద స్కూల్స్ లో ముందుగా 11వ తరగతి బోధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీనితో క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలపై ఓ అవగాహన వస్తుంది. ఆ తరువాత దశల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ టూ ఎడుకేషన్ సిస్టమ్ ను అమలు చేయచ్చని ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఇంటర్ బోర్డు పరిధిలోనే పరీక్షలా.. కొత్త బోర్డా?
పైలెట్ పద్దతిన ఎంపిక చేసిన స్కూల్స్ లో 11వ తరగతి కోసం అడ్మిషన్లు తీసుకుని, అక్కడే క్లాస్ లు నిర్వహిస్తారు. అయితే అన్ని కోర్సులు కాకుండా ఎంపిక చేసిన రెండుమూడు కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనితో ఆ స్కూల్స్ లో ప్లస్ టూ బోధనకు శ్రీకారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పరీక్షలు మాత్రం ఇంటర్ బోర్డు పరిధిలో నిర్వహించడమా?లేకపోతే కొత్తగా మరో బోర్డు చేయడమా?అలా కాకుండా ఆ వంద స్కూల్స్ ను ఎస్ఎస్సీ పరిధిలోకి తీసుకురావడమా?అనే కోణంలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యలను సైతం అంచనా వేస్తున్నట్లు తెలిసింది.
అందుకే ఇంటర్ షెడ్యూలు వాయిదా!
ఈ ఏడాది నుంచి ప్లస్ టూ ను అమలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. ఒకసారి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైతే టెన్త్ పాస్ అయిన స్టూడెంట్స్ జూనియర్ కాలేజీల్లో జాయిన్ అయ్యేందుకు వెళ్లిపోతారు. దీనితో ఎంపిక చేసిన స్కూల్స్ లో ప్లస్ టూ సిస్టమ్ అమలు చేయడం కష్టం. అందుకే అడ్మిషన్ షెడ్యూలును వాయిదా వేసినట్లు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.






