మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లు షురూ: మే 25 వరకు దరఖాస్తు గడువు

by Kema Shiva Kumar |

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది.

మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లు షురూ: మే 25 వరకు దరఖాస్తు గడువు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం కోర్సుల్లో ఉచితంగా చేరడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను మే 13 నుంచి 25 వరకు స్వీకరించనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 27న ప్రకటిస్తారు. మే 28 నుంచి 30 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండగా.. జూన్ 1 నుంచి తరగతులను ప్రారంభం అవుతాయి.

ఈ ఏడాది నుంచి మోడల్ స్కూళ్లలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులతో పాటు కొత్తగా ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశపెట్టారు. ఇంటర్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం, గతంలో ఉన్న ఎంఈసి (MEC) గ్రూపు స్థానంలో ఇకపై ఏసీఈ గ్రూపు ఉంటుంది. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు యథావిధిగా ఎంఈసిలోనే కొనసాగుతారు, కానీ కొత్త అడ్మిషన్లు మాత్రం ఏసీఈ గ్రూపులోనే జరుగుతాయి. బిజినెస్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఈ మార్పు చేశారు. ప్రతి గ్రూపులో 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల విద్యార్థులు https://tgms.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Next Story