Smita Sabharwal: కర్మణ్యే వాధికారస్తే.. భగవద్గీత శ్లోకంతో స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-04-30 11:22:31  IST  )

ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌‌ను ఆ పోస్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

Smita Sabharwal: కర్మణ్యే వాధికారస్తే.. భగవద్గీత శ్లోకంతో స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ (Tourism Department) ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌‌ (Smita Sabharwal)ను ఆ పోస్ట్ నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర పర్యటక సాంస్కృతిక శాఖను సినియర్ అధికారి జయేశ్ రంజన్‌కు కేటాయించారు. స్మితా సబర్వాల్‌కు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ బదిలీ వేటు తర్వాత (Bhagavad Gita) భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేస్తూ.. ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ ఎక్స్ వేదికగా మరో సంచలన ట్వీట్ చేశారు.

‘కర్మణ్యే వాధికారస్తే, మాఫలేషు కదాచన, పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా ఉత్తమంగా చేయగలిగినంత చేశాను. రాష్ట్రానికి తొలిసారిగా, 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకొచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్షించబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన పునాది అవుతుంది. శాఖ పనితీరును మళ్లీ ఆకళింపు చేసి, బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశాను. ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళికా మౌలికతల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నమ్మకం ఉంది’ అని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పర్యాటక శాఖలో పనిచేయడం గర్వంగా, గౌరవంగా ఉందని నమస్కారం సింబల్ జోడించారు.

ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌కు నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. మీరు టూరిజం లో చాలా మార్పు తీసుకొని వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ సంచలన పోస్ట్ పెట్టడంతోని ప్రభుత్వం ఆమెను పక్కన పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంచె గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story