- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసక్తికరంగా ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు (సోమవారం) సిట్ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో/ సిటీ క్రైమ్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు (సోమవారం) సిట్ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆదివారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు అయిన తన పాస్‌పోర్ట్‌ను తిరిగి చెల్లుబాటులోకి తెచ్చి దానిపై ట్రావెల్ డాక్యుమెంట్ అనుమతి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవడంతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ఆయన్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీద లుక్ అవుట్ నోటీసు, రెడ్ కార్నర్ నోటీసులు ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందు, ఈనెల 6 తేదీన ప్రభాకర్ రావుకు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇండియన్ ఎంబసీ నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిసింది.
సిట్ ఎదుట హాజరు కావాల్సిందే..
హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ఎట్టి పరిస్థితుల్లో్నూ సిట్ విచారణకు హజరవ్వాల్సిందే అని సిట్ అధికారులు చెబుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారని కేసు విచారణ చేసిన పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాష్ట్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మే 29న ప్రభాకర్ రావుకు వన్-టైమ్ ట్రావెల్ పర్మిట్ జారీ చేస్తూ మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని, సిట్ విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే.. విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని తెలంగాణ పోలీసులకు సూచించింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఉదయం సిట్ విచారణకు ఆయన హాజరు కానున్నట్లు తెలుస్తుండగా.. ఆ విషయాన్ని ఉన్నతాధికారులు ధృవీకరించారు. విచారణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇదిలాఉండగా, సిట్ విచారణ కేంద్రాన్ని మాసబ్ ట్యాంక్ నుంచి మరల జూబ్లీహిల్స్‌కు తరలించినట్లు తెలుస్తోంది. గతంలో జూబ్లీహిల్స్‌లోని విచారణ కేంద్రంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగిన విషయం తెలిసిందే.
ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశాం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన పోలీసులు అధికారులు అంతా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ట్యాపింగ్ చేశామని సిట్ విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే.. అసలు ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు. పెన్ డ్రైవ్‌లలో రికార్డు చేసిన కాల్ రికార్డింగ్స్ ఎవరు విన్నారు? ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? దీని వలన ఎవరు అధికంగా లబ్ది పొందారు? ట్యాపింగ్ పరికరాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎన్ని తెచ్చారు? అందుకోసం ఎంత ఖర్చు చేశారు? వంటి విషయాలన్నింటిపై ఆయన్ను పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపనుంది. కాగా, మొత్తం 1,300 ఫోన్లను ట్యాప్ చేసి సంభాషణలను విన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
కస్టమ్ అధికారి స్వాగతం..
15 నెలల తర్వాత అజ్ఞాతం వీడి అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రభాకర్ రావుకు ఓ కస్టమ్ అధికారి స్వాగతం పలికినట్లు సమాచారం. ఆ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి విధుల్లో ఉన్న అధికారి స్వాగతం పలకడం చట్ట విరుద్ధం. సిటీ పోలీసుల నివేదిక మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రభాకర్ రావుకు స్వాగతం పలికిన సదరు కస్టమ్ అధికారిపై రిపోర్ట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు స్వాగతానికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.






