స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. ‘మఖ్దూం భవన్’ వైపు మాజీ మావోయిస్టుల అడుగులు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-11 16:22:15  IST  )

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ బృందం రేపు హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో భేటీ కానున్నారు.

స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. ‘మఖ్దూం భవన్’ వైపు మాజీ మావోయిస్టుల అడుగులు!
X

దిశ, వెబ్‌‌డెస్క్: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (Devji) బృందం, ఇతర నేతలు రేపు హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ‘మఖ్దూం భవన్’ (Makhdoom Bhavan)‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు వారంతా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిసి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల సాయుధ పోరాటాన్ని వీడి ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చిన ఈ నేతలకు సీపీఐ శ్రేణులు సాదర స్వాగతం పలుకుతున్నాయి.

హాట్‌ టాపిక్‌గా భేటీ..

కాగా, ఇటీవలే కూనంనేని సాంబశివరావు కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమసమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి మాతృపార్టీ సీపీఐలో చేరాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే, కేవలం ఇది మర్యాదపూర్వక భేటీ అని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న రాజకీయ అంతరార్థంపై లోతైన చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న మాజీ మావోయిస్టు నేతలు సీపీఐతో చేతులు కలపడం వల్ల పార్టీకి కొత్త రక్తం, ఊపు వచ్చే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై పోరాటంలో ఈ నేతల అనుభవం సీపీఐకి ఎలా ఉపయోగపడబోతోందని ఆసక్తిరంగా మారింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో వామపక్షాల బలం పుంజుకుంటుందా.. అన్న ప్రశ్నలు ఎర్ర దండులో తలెత్తుతున్నాయి.

Next Story