- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: తెలంగాణ బీజేపీ బనకచర్లను వ్యతిరేకించలేదు.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బనకచర్ల విషయంలో ఏపీ వర్సెస్ తెలంగాణ మధ్య రాజకీయం రంజుగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో : గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయం హాట్ హాట్‌గా మారింది. కేంద్రంలో పలుకుబడి ఉందని బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకుంటే అది చంద్రబాబు నాయుడు భ్రమే అవుతుంది అని, ఈ ప్రాజెక్టు విషయంలో టెక్నికల్, లీగల్, పొలిటికల్ మూడు పద్ధతుల్లో పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎవరు ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదని కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే అభ్యంతరం ఎందుకని? తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా? ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని, మిగిలిన నీటినే వాడుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేటాయింపుల చట్టబద్ధత కోసం కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, వీటిని ఏపీ, తెలంగాణ రెండూ వాడుకోవచ్చన్నారు. కృష్ణానదిలో మాత్రం నీళ్లు తక్కువ ఉన్నాయని, కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చెప్పారు. తెలంగాణ పైన ఉందని, కింద ఉన్న ఏపీ సముద్రంలోకి వెళ్లే నీళ్లు వాడుకుంటే ఇబ్బందేంటని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం లేదన్నారు.
కాళేశ్వరానికి అడ్డుపడ్డానా?..
ఉమ్మడి ఏపీలో తానే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాననే విషయం గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. తెలంగాణలోని దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా తాను మొదలుపెట్టిన ప్రాజెక్టులేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకుని బాగుపడాలని కోరుకుంటానని గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని సూచించారు. తాను క్రియేట్ చేసిన హైదరాబాద్ ఎకో సిస్టమ్ బాగా పనిచేసి తెలుగు జాతికి ఉపయోగపడుతుందని, ఇది ఓ రాజకీయ నాయకుడిగా తనకు ఆనందాన్ని ఇస్తున్నదన్నారు. తన విజన్ వల్లే తెలంగాణ దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఉన్న రాష్ట్రంగా మారిందన్నారు. కానీ తాను ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో నగరం తెలంగాణకు వెళ్లిందని, తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారని, ఇది తనకు హ్యాపీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ వ్యతిరేకించలేదు..
బనకచర్ల విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. ఎవరికి అన్యాయం జరగకండా చేద్దామని అంటున్నారని చెప్పారు. మనం మనం తిట్టుకోవడమే కావాలని కొంతమంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే అందరం కలిసి పోటీ పడి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని, రాబోయే 20 ఏళ్ల తర్వాత ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నంబర్ స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.






