- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ కాలేజీల ఇష్టారాజ్యం..! ఫిర్యాదులను పట్టించుకోని బోర్డు
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ‘నీట్, ఐఐటీ, ఎంసెట్’ పేర్లతో లక్షల్లో ఫీజులు వసూలు వసూలు చేస్తున్నాయి. అనుమతులు ఒక చోట తీసుకొని మరోచోట తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో కళాశాలల ఆగడాలపై ఇంటర్మీడియట్ బోర్డుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయినా అధికారులు రెండేళ్లుగా సరైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షోకాజ్ నోటీసులతో కాలం వెళ్లదీస్తున్న ఆఫీసర్లు.. పెనాల్టీలు విధించడంలో అలసత్వం వహిస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అడ్డగోలుగా అడ్మిషన్ల దందా
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకుంటున్నాయి. ఆ తర్వాత ఐఐటీ, నీట్, ఎంసెట్ ర్యాంకుల పేరుతో రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. సండే, పబ్లిక్ హాలీడేస్ ఉన్న రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కనీస వసతులు లేని కమర్షియల్ కాంప్లెక్సుల్లో, నిబంధనలకు విరుద్ధంగా, ‘అకాడమీ’ల పేరుతో అనుమతి లేకుండా కళాశాలలను నిర్వహిస్తున్నారు. కళాశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కోచింగ్ ఓరియంటెడ్ తరగతులు నిర్వహిస్తూ.. ఇంటర్ సిలబస్ ను డిసెంబర్ లో ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేస్తున్నారు. ఆయా కాలేజీల నిర్వాకంపై ఇంటర్మీడియట్ బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల తీరు వల్లే కార్పొరేట్ కాలేజీలు మరింతగా రెచ్చిపోతున్నాయని పేర్కొంటున్నాయి.
వివాదాస్పదంగా ఇంటర్ బోర్డు అధికారుల తీరు..
అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నా ఇంటర్ కాలేజీల కార్యక్రమాలకు ఇంటర్ బోర్డు అధికారులు హాజరవుతుండడం వివాదాస్పదంగా మారుతున్నది. ఒకవైపు కాలేజీలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ, మరోవైపు వాటి కార్యక్రమాలకు హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బోర్డు చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తుందని, నిబంధనల ఉల్లంఘించే కాలేజీలపై వెంటనే విచారణ జరిపి, ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నోటీసులు సరే.. పెనాల్టీ ఎప్పుడు?
- న్యూ శ్రీచైతన్య జూనియర్ కాలేజీ: తుర్కయంజాల్ సాగర్ హైవే రోడ్డు పక్కన బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయంపై అనుమతి తీసుకొని ఈ కళాశాలను నడిపిస్తున్నారు. కానీ ఇదే పేరుతో నిబంధనలకు విరుద్దంగా తుర్కయాంజాల్ లోని కమ్మగూడ, రాఘవేంద్ర నగర్ లో సైతం బ్రాంచీలు నిర్వహిస్తున్నారు.
- కృష్ణవేణి జూనియర్ కాలేజీ: బీఎన్ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు సమీపంలో అనుమతి తీసుకొని ఈ కళాశాలను నడిపిస్తున్నారు. అయితే ఇదే పేరుతో శ్రీపురం కాలనీలో మరో కాలేజీని నిర్వహిస్తున్నారు.
- మహర్షి జూనియర్ కాలేజీ: అనుమతులు తీసుకొని హస్తినాపురం పద్మావతి నగర్ కాలనీలో కళాశాలను నిర్వహిస్తుండగా.. ఇదే పేరుతో వనస్థలిపురంలోని ప్రశాంతి కాలనీలో అక్రమంగా మరో కాలేజీని రన్ చేస్తున్నారు.
- అక్షర జూనియర్ కాలేజీ: హస్తినాపురం ఫేజ్-2 లోని బాలాజీకాలనీలో అనుమతులతో ఈ కళాశాల నిర్వహిస్తుండగా.. ఇదే పేరుతో బీఎన్ రెడ్డి సాగర్ రోడ్డు హైవే సమీపంలో మరొక కాలేజీని అనుమతులు తీసుకోకుండానే నిర్వహిస్తున్నారు.
- వల్లీ ఓక్ జూనియర్ కాలేజీ: నార్సింగిలోని పుప్పాల గూడ మెయిన్ రోడ్ సమీపంలో వల్లీ ఓక్ జూనియర్ కాలేజీ పేరిట అనుమతి తీసుకున్నారు. అయితే వల్లీ ఓక్ నుండి ‘నైన్ కాలేజీ’కి అడ్మిషన్లను ఫార్వర్డ్ చేస్తూ అక్కడ అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.
ఆయా కాలేజీలపై రెండేళ్లుగా వివిధ విద్యార్థి సంఘాలు, సీజేఎస్ సంస్థ వరుసగా ఫిర్యాదులు చేస్తున్నా.. ఇంటర్ బొర్డు అధికారులు షోకాజ్ నోటీసులతో సరిపెడుతున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక్కో కాలేజీకి రూ. 10 లక్షల చొప్పున ఇంటర్ బోర్డు పెనాల్టీ విధించాల్సి ఉంటుంది. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. చర్యలు తీసుకోకపోవడమే కాకుండా పెనాల్టీల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను అడ్డుకుంటున్నారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.






