జూనియర్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు తనిఖీలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా ఇంటర్ బోర్డు కాలేజీల్లో తనిఖీలు చేపట్టింది.

జూనియర్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు తనిఖీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా ఇంటర్ బోర్డు కాలేజీల్లో తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1752 ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు, పరిపాలనా పరమైన నిబంధనలు అమలుపరిచేందుకు ఈ నెల 15 వరకు ఇంటర్ బోర్డు తనిఖీలు నిర్వహించనుంది. ఈ తనిఖీల్లో స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రటరీలు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు(డీఐఈఓ)లు తమ పరిధిలోని కాలేజీలను తనిఖీ చేయనున్నారు. తనిఖీలు పూర్తయిను వెంటనే సమగ్ర తనిఖీ నివేదికను ఇంటర్ బోర్డు కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుది.

తనిఖీల్లో ప్రధానంగా ఆయా అంశాలపై ద్రుష్టి సారించనున్నారు. అందులో ప్రధానంగా ప్రైవేటు కాలేజీల్లో అఫ్లియేషన్ ఉందా లేదా, విద్యార్థుల డేటా ఎంట్రీ సరిగా ఉందా లేదా, ప్రభుత్వ కాలేజీలు కోచింగ్ క్లాసులు నడుపుతున్నారా లేదా పరిశీలిస్తారు. అలాగే కాలేజీలు యూనిఫాం టైం టేబుల్ ఫాలో అవుతున్నాయా లేదా, సిలబస్ పూర్తయిందా, విద్యార్థుల హాజరు ఎంత ఉంది అనేది చెక్ చేస్తారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఇంకా 83 రోజుల సమయం ఉన్నందున దీని ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి సిలబస్ పూర్తి చేస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించనున్నారు.

ఇంకా స్టాఫ్ డేటా సబ్మిషన్ అయిందా లేదా, కాలేజీల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉంది, అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పాక్షికంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను పరిశీలిస్తారు. తనిఖీ సమయంలో అధికారులు కాలేజీల సంస్థాగత రికార్డులు, సిబ్బంది వివరాలు, విద్యార్థుల హాజరును తప్పనిసరిగా ధ్రువికరించాలి. కాలేజీలు బోర్డు నిర్దేశించిన నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయో లేదా నిర్థారించాలి. తనిఖీ అధికారులు అన్ని కాలేజీల వివరాలను అక్కడిక్కడే అకడమిక్ మాడ్యుల్ లో సేకరించి, నమోదు చేయాలని ఇంటర్ బోర్డు సూచించింది.

Next Story