- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవా

కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
ఈ నెల 20న గచ్చిబౌలిలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇప్పటివరకు 3 లక్షల స్లాట్ బుకింగ్‌లు
ప్రయోగాత్మకంగా ఆర్మూర్, కూసుమంచి ఎస్. ఆర్.వో కార్యాలయాల్లో ఈ- ఆధార్ సంతకం
– రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు ఇప్పటికే పలు మెరుగైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో అత్యుత్తమ సేవలు అందించడానికి వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలనకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట సబ్– రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరించి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండడంతో పాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుందన్నారు.
ఏ ఆఫీసు ఎక్కడంటే...
మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, గండిపేట, షేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్ నాలుగు ఆఫీసులను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనానికి ఈనెల 20వ తేదీన శంకుస్ధాపన చేయనున్నారని తెలిపారు. శంకుస్దాపనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. మరో పదమూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాల కోసం స్ధలాలను గుర్తించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
అబ్దుల్లాపూర్, పెద్ద అంబర్ పేట్, హయత్‌నగర్, వనస్ధలిపురం నకు సంబంధించి కోహెడ్ లో
మహేశ్వరం, ఇబ్రహింపట్నం, శంషాబాద్‌కు సంబంధించి మహేశ్వరం మండలంలోని మంకాల్ లో,
ఆర్వో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట్ కు సంబంధించి కండ్లకోయలో
ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరికి సంబంధించి బోడుప్పల్ లో
బంజారాహిల్స్, ఎస్.ఆర్. నగర్, గొల్కోండకు సంబంధించి బంజారాహిల్స్‌లో,
ఆజంపూరా, చార్మినార్, దూద్‌బౌలి సంబంధించి మలక్‌పేటలో
ప్రజల సమయాన్ని ఆదా చేసే విధంగా పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించేలా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా అమలవుతుందన్నారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి దశల వారీగా జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల స్లాట్ బుకింగ్‌లు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. స్టాంప్స్ , రిజిస్ట్రేషన్ శాఖను తమ ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా చూడడం లేదని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా ప్రజల సమయాన్ని ఎంతో ఆదాచేశామని , మరింత వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా ఈ- ఆధార్ విధానాన్ని తీసుకురాబోతున్నామని ఇప్పటికే ఈ విధానాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలవుతుందని త్వరలో అన్ని కార్యాలయాల్లో అమలు చేస్తామని వివరించారు.






