- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహ ఏర్పాటు.. వ్యతిరేకించిన మునిమనవడు తుషార్ గాంధీ
గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం నివాసితులను ఖాళీ చేయించడం సరికాదని, ఇది గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవన పథకం (Musi Revitalization Project)లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘గాంధీ సరోవర్’ (Gandhi Sarovar) ప్రాజెక్టు కోసం వడివడిగా భూసేకరణ ప్రక్రియను చేపడుతున్నది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ కోసం సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే భూసేకరణలో భాగంగా బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏమో కానీ.. తాము చెట్టుకొకరు, పుట్టకొకరులా విడిపోయే పరిస్థితి వచ్చిందని పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం, సీఎంవోకు ట్యాగ్ చేస్తూ తుషార్ గాంధీ ట్వీట్..
అయితే, ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును ఉద్దేశించి గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ (Tushar Gandhi) సీఎం రేవంత్ రెడ్డితో పాటు, సీఎంవోను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టడం అస్సలు సరికాదని అన్నారు. బాపు బతికి ఉంటే ‘నా పేరు మీద ఇలాంటివి చేయొద్దు, వెంటనే ఆపండి’ అని చెప్పేవారని పేర్కొన్నారు. విగ్రహాల కంటే ప్రజల కనీస అవసరాలే ముఖ్యమని గాంధీజీ నమ్మేవారని, అటువంటిది ఆయన విగ్రహం కోసమే పేదల ఇళ్లను తొలగించడం ఆయన సిద్ధాంతాలకు విరుద్ధం’ అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.
ఇక తుషార్ గాంధీ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు కూడా స్పందించారు. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నారు. అభివృద్ధి, విగ్రహాల పేరుతో నిరుపేదలను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే మరికొందరు కామెంట్ చేస్తున్నారు.






