Harish Rao: రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ మరో అస్త్రం.. హరీశ్ రావు సంచలన ఆరోపణ

by Prasad Jukanti |

పాలమూరు రంగారెడ్డి, గోదావరి, కృష్ణా నీటి వాటాల అంశం తర్వాత మరో అంశంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

Harish Rao: రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ మరో అస్త్రం.. హరీశ్ రావు సంచలన ఆరోపణ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రిల (Telemetry) కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను KRMB దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రిల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు.. జూన్ 2016లో జరిగిన KRMB సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరం అన్నారు.

తెలంగాణకు తీరని అన్యాయం:

కేఆర్ఎంబీ నిర్ణయం ధిక్కరిస్తూ టెలీమెట్రి ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు కేంద్రం నిలదీయలేదు? ఎందుకు ఏపీ మీద ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉన్నట్లు? అని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన KRMB, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. టెలీమెట్రి ఏర్పాటు చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుండి కేంద్రం చేసింది ఏం లేదన్నారు.

కావాలనే నిర్లక్ష్యం శోచనీయం:

సబ్ జ్యూడిస్ అని సాకులు చెప్పే కేంద్రానికి, సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పటికీ కేసీఆర్ 18 చోట్ల టెలీమెట్రిలు ఏర్పాటు చేసిన విషయం గుర్తు లేదా? పోలవరం నల్లమల సాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లు గానే టెలిమెట్రిల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం అన్నారు. రూ.4.18 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే రికవరి అయ్యేలా చేసి, టెలిమెట్రిల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా నిధులు మళ్లించిన KRMB పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story