Telangana Dalit Bandhu Scheme 2022 :ఎమ్మెల్యేల ఓట్ల రాజకీయం.. దళితుల మధ్య 'బంధు' చిచ్చు!

by Dishanational2 |
Telangana Dalit Bandhu Scheme 2022 :ఎమ్మెల్యేల ఓట్ల రాజకీయం.. దళితుల మధ్య బంధు చిచ్చు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళితుల మధ్య 'దళిత బంధు' స్కీం చిచ్చుపెడుతున్నది. మాల వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని ఆ కుల సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో 80 శాతం మాదిగలు ఉండగా, కేవలం 20 శాతమే మాలలు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాల వర్గాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి వివక్షే ఉన్నదని వివరిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నదంటూ అంసా (ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్) నాయకులు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్, దళిత బంధు అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పించడం లేదని వాపోతున్నారు. ఎమ్యెల్యేలూ ఓట్ల రాజకీయం చూపుతున్నారని అంసా స్పష్టం చేస్తున్నది. వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం మాదిగ వర్గాలకే మద్దతు చూపుతున్నారని, దీంతో తమకు నష్టం జరుగుతున్నదని అంసా లీడర్లు పేర్కొంటున్నారు. దళిత బంధు స్కీం సెలక్షన్​ లిస్టును 50 శాతం చొప్పున రేషియా మెయింటేన్​చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్​చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఇట్లా పసిగట్టారు..?

దళిత బంధు పథకం కింద తొలి విడుత అసెంబ్లీ సెగ్మెంట్‌కు 100 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు రెండో విడుత ఫస్ట్ రౌండ్‌లో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 500 మందిని ఎంపిక చేస్తున్నారు. అయితే బెనిఫియర్లందరికీ జిల్లా కలెక్టరేట్లలో బ్యాచ్‌ల వారీగా మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్‌లకు వివిధ కుల సంఘాల నాయకులను కూడా స్వయంగా అధికారులే ఆహ్వానిస్తున్నారు. స్కీమ్ పంపిణీ సమయంలో మాలలతో పోల్చితే మాదిగలు ఎక్కువగా ఉన్నట్లు కుల సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వాగ్వాదాలు కూడా జరిగాయి. ఆఫీసర్లు సర్దుబాటు చేయడంతో రెండు వర్గాలకు చెందిన లీడర్లు సైలెంట్ అయ్యారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే మార్గదర్శకాల్లో జనాభా దామాషా ప్రకారం రేషియోను ఫిక్స్​ చేయాలని మాల సంఘాల నాయకులు కోరుతున్నారు.

అసెంబ్లీ ముట్టడిస్తాం

- చిక్కుడు వెంకట్, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెడిసెంట్

దళితుల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకొచ్చిన దళిత బంధు స్కీమ్​మంచిదే. అయినప్పటికీ చిన్న తప్పిదాలతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నది. మాదిగలు ఎక్కువ ఉన్నారని ప్రతి నియోజకవర్గంలో 80 శాతం మందికి అవకాశం ఇస్తున్నారు. కానీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఈ పరిస్థితి లేదు. మాల కులానికి చెందిన వారు కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఉన్నారు. కానీ కేవలం 20 శాతం మందిని మాత్రమే దళిత బంధు స్కీమ్‌లో ఎంపిక చేయడం బాధాకరం. గడిచిన ఎనిమిది ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లల్లోనూ మాలలకు ఇదే విధంగా అన్యాయం జరిగింది. ఎన్నో ఏళ్లుగా మాలలు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. లేదంటే సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రగతిభవన్‌తో పాటు త్వరలో జరగబోయే శీతాకాల సమవేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తాం.


Next Story

Most Viewed