నష్టం జ‌రిగాక కాదు.. జ‌ర‌గ‌క‌ముందే స్పందించాలి: అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

by Gantepaka Srikanth |

ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌ల నేప‌థ్యం

నష్టం జ‌రిగాక కాదు.. జ‌ర‌గ‌క‌ముందే స్పందించాలి: అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌ల నేప‌థ్యంలో గోదావరి కృష్ణా న‌దీ ప‌రివాహక ప్రాంతాల్లో వీలైనంత‌వ‌ర‌కు ప్రాణ, ఆస్తి, ఆర్థిక న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఇప్పటి నుండే ప‌క‌డ్బందీ చ‌ర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గోదావ‌రి, కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో వ‌ర‌ద నిర్వహ‌ణ‌పై ఆయా జిల్లాల క‌లెక్టర్లతో గురువారం స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్‌లో మంత్రి పొంగులేటి ఉన్నత‌స్థాయి స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి విప‌త్తుల వ‌ల్ల న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత స్పందించేదానికంటే నష్టం జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. హైద‌రాబాద్ త‌ర‌హాలోనే రాష్ట్రస్థాయిలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల‌లో చేప‌ట్టవ‌ల‌సిన చ‌ర్యలు, విప‌త్తుల నిర్వహ‌ణ విభాగం బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్, అగ్నిమాప‌క డీజీ, విప‌త్తుల నిర్వహ‌ణ క‌మిష‌న‌ర్, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ డైరెక్టర్, నీటిపారుదల‌, ఆర్అండ్‌బీ, ఆరోగ్య శాఖ‌ల క‌మిష‌న‌ర్లతో ఉన్నత స్థాయి క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని వెల్లడించారు. ఈ క‌మిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుంద‌ని.. ఆ నివేదిక ప్రకారం చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని తెలిపారు.

గతేడాదికి మించి వర్షాలు పడే ఛాన్స్

ఈ ఏడాది వ‌ర్షాకాల సీజ‌న్ అనుకున్నదానికంటే 15 రోజుల ముందుగానే వ‌చ్చింద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా క‌లెక్టర్లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని, అన్ని విభాగాల‌తో స‌మ‌న్వయం చేసుకొని ప్రకృతి వైప‌రీత్యాల ప్రభావం వీలైనంత‌ వ‌ర‌కు త‌గ్గించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని పొంగులేటి సూచించారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రదేశాలలో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో హ‌ఠాత్తుగా వ‌చ్చే వ‌ర్షాల‌తో ఊహించని వరదలు వస్తున్నాయ‌ని, గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప‌క‌డ్బందీ చ‌ర్యలు తీసుకోవాల‌ని అన్నారు. నిర్వాసితుల‌ను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా త‌ర‌లించి వారికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులు చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. గ‌తేడాది ప‌రివాహ‌క ప్రాంతాల్లో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వ‌ర్షం ప‌డ‌డం వ‌ల్ల న‌ష్టం ఎక్కువగా జ‌రిగింద‌ని.. ఈసారి కూడా అటువంటి ప‌రిస్థితి ఎదురైతే న‌ష్టాన్ని త‌గ్గించే విధంగా ముంద‌స్తుగా ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు.

మూస పద్ధతికి స్వస్తి చెప్పండి..

రెవెన్యూ విప‌త్తుల నిర్వహ‌ణ శాఖ మూస‌ ప‌ద్ధతికి స్వస్తి చెప్పి మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకొని అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాల‌ని పొంగులేటి ఆదేశించారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు, నిర్వహణ, ముందస్తు హెచ్చరికల కోసం అవసరమైన యూజర్ ఐడీల‌ను ఇవ్వాల‌ని, గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వరదల కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ల‌ను ఈనెల 30వ తేదీలోగా త‌యారు చేసుకోవాల‌ని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆపద మిత్ర వాలంటీర్స్, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సహాయంతో సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల‌ని సూచించారు. వరద నియంత్రణ కట్టలు, చిన్న-మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్‌లు మొదలైన వాటిని పరిశీలించి రిపేర్లు చేయించాలన్నారు.

రిలీఫ్ క్యాంపుల ప్రదేశాలు, సంప్రదించవలసిన నెంబర్లు మొదలైనవి ఉండాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర, పొడి ఆహార కిట్లు ముందే సిద్ధంగా ఉంచాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖల సామాన్యంతో పనిచేయాల‌ని కంట్రోల్ రూములు ప్రారంభించాల‌ని అత్యధిక ప్రమాద ప్రాంతాలలో స్థానిక రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ వైద్య బృందాలు, అవసరమైన మందులు, నీటి శుద్ధి మాత్రలు, పారిశుధ్య కిట్లు వంటివి తగిన మొత్తంలో అందుబాటులో ఉంచాల‌న్నారు. ఈ స‌మావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ న‌వీన్ మిట్టల్, రాష్ట్ర విప‌త్తుల నిర్వహ‌ణ శాఖ క‌మిష‌న‌ర్ హ‌రీష్‌, అగ్నిమాప‌క శాఖ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ నాగిరెడ్డి, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్, పంచాయితీరాజ్ క‌మిష‌న‌ర్ సృజ‌న‌, సీపీ డీసీఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవ‌సాయ స‌హ‌కార శాఖ డైరెక్టర్ బి.గోపి, ఐఎండీ అధికారి నాగ‌ర‌త్నం, ఆదిలాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గ‌ద్వాల్, ములుగు, నిర్మల్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల క‌లెక్టర్లు పాల్గొన్నారు.

Next Story