రాష్ట్రంలో అమానవీయ ఘటన.. మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన వైనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-28 05:34:54  IST  )

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో అమానవీయ ఘటన.. మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన వైనం
X

దిశ, వెబ్‌డెస్క్/హనుమకొండ: సభ్యసమాజం తలదించుకునే ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ యువతిని దశాబ్దం క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి వివాహం చేశారు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ వ్యక్తి తన సమీప బంధువైన మరో వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. ఆమెతో కలిసి పది రోజుల క్రితం అజ్ఞాతంగా వెళ్లిపోయినట్లుగా సమాచారం. ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న మొదటి భార్య, తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు వివరించేందుకు స్వగ్రామమైన తాటికాయలకు చేరుకుంది. ఆమె చెప్పిన విషయాలపై ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు స్పందనగా మానవత్వాన్ని మరిచి ఘోరంగా వ్యవహరించారు.

మంచానికి కట్టేసి వివస్త్రం.. జననాంగంపై జీడిపోసి హింస

సుమారు ఐదు రోజుల క్రితం ఆ మహిళా దంపతులను తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి ప్రజల ముందు పెట్టారు. గ్రామస్థుల సమక్షంలో వాళ్లిద్దరినీ విచక్షణారహితంగా దాడి చేశారు. మొదటగా ఇద్దరికీ అర గుండు గీయించి అవమానించగా.. అనంతరం బాధిత మహిళను మంచానికి కట్టేసి పూర్తిగా వివస్త్రను చేశారు. ఇంతటితో ఆగకుండా ఆమె జననాంగంపై పురాతన కాలంలో ఉపయోగించే ‘జీడి’ని దారుణంగా పోసి శారీరకంగా హింసించారు. జీడి తీవ్రమైన నొప్పి, వాపు, గాయం, పుండ్లకు కారణమయ్యే ప్రమాదకరమైన పదార్థం. బాధిత మహిళ ఎంత వేడుకున్నా.. తప్పు చేశాను, క్షమించండి అని కేకలు వేసినా ఎవరూ కనికరించ లేదు. గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.

తీవ్ర రక్తస్రావం.. ఆ తర్వాత ఆచూకీ లేదు

ఈ దాడిలో తీవ్ర గాయాలైన మహిళకు యోనిలోంచి రక్తస్రావం ప్రారంభమయినా ఆమెకు చికిత్స కల్పించ లేదు. అనంతరం ఆమెను, ఆమె భర్తను ఎక్కడికి తీసుకెళ్లారన్నది ఇప్పటి వరకు తెలియ రాలేదు. కుటుంబ సభ్యులు, పోలీసులకు గానీ వారి ఆచూకీ లభించ లేదు. ప్రాణాలతో ఉన్నారా.. లేక ఏదైనా ప్రమాదం జరిగిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికీ పోలీసులకు సమాచారం లేదట

ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదు. బాధితుల బంధువులు భయబ్రాంతులకులోనై ఉండడం వల్లనా? లేక గ్రామస్థుల బెదిరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్వయంగా చొరవ చూపించి విచారణ చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి పాశవిక చర్యలు తాత్కాలిక కోపంతో జరిగాయన్న నెపంతో వదిలేయడం మానవ హక్కుల ఉల్లంఘన. ఓ మహిళపై సామూహికంగా దాడి చేసి.. హింసించడం నేరం. సమాజంలోని అసహనాన్ని ఈ ఘటన ప్రతిభింభిస్తోంది. బాధితులకు న్యాయం చేయడమే కాకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అవగాహనలేమి..చట్టాలపై అవిశ్వాసం

గ్రామీణ ప్రాంతాల్లో అమానవీయ ఘటనపై చట్టాల పట్ల అవగాహనలేమి, వ్యక్తిగతంగా శిక్షలు విధించాలన్న తప్పుడు దృక్పథాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇది సమాజానికి తీవ్ర హెచ్చరిక. స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగం జోక్యం చేసుకుని బాధితులకు సాయం చేయడంతో పాటు, శిక్షించాల్సిన వారిని గుర్తించి న్యాయం జరగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఒక మహిళపై జరిగిన ఈ అత్యంత దారుణంపై సమాజం ప్రశ్నించాలి? పంచాయితీలు లేదా సామూహిక బెదిరింపులు చట్టానికి మించినవిగా తయారవుతున్నాయని ఈ ఘటనతో స్పష్టమవుతోంది. బాధితురాలిని కాపాడేందుకు సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కేసు విచారణలో పాలకులు, పోలీసులు స్పందిస్తారా? బాధితుల ఆచూకీ ఎప్పటికీ బయటపడుతుందోనని సమాజం ఎదురుచూస్తోంది.

Next Story