మా ప్రాంతాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి: గిరిజన ప్రజాప్రతినిధుల బృందం

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతలోనూ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని మంత్రి సీతక్క నేతృత్వంలోని గిరిజన ప్రజాప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని కోరింది. ..

మా ప్రాంతాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి: గిరిజన ప్రజాప్రతినిధుల బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతలోనూ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని మంత్రి సీతక్క నేతృత్వంలోని గిరిజన ప్రజాప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వారు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. మొదటి విడతలో ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా 1,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందుకు మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటు, మౌలిక సదుపాయాల కొరత దృష్ట్యా ఇప్పటికీ అనేక ఆదివాసీ కుటుంబాలు పూరి గుడిసెల్లో, తాత్కాలిక నివాసాల్లోనే కాలం వెళ్లదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రెండో విడతలో సాధారణ నియోజకవర్గాల కంటే ఏజెన్సీ ప్రాంతాలకు అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు వెల్లడించారు.

Next Story