వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 'ఈమని శంకర శాస్త్రి గారి స్మరణలో వీణా షట్కం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీణా విన్యాసంలో తెలుగు వారికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహామహోపాధ్యాయ ఈమని శంకర శాస్త్రి 103వ జయంతి సందర్భంగా, వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ, ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈమని స్వర వీణాలయ బృందానికి, కళాకారులకు ప్రత్యేక అభినందనలు అంటూ తెలిపారు.

ముఖ్యంగా వారి కుమార్తె, శిష్యురాలు కూడా అయిన ఈమని కళ్యాణి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందుకు అభినందించారు. వారసత్వం అంటే ఆస్తులు, అధికారాలు పంచుకోవడం కాదు, వారి సత్త్వాన్ని అందిపుచ్చుకోవడం అని నిరూపించారని కొనియాడారు. ఆరు వీణల షట్కం అమృతాన్ని పంచి అద్భుతంగా సాగిందని అభిప్రాయపడ్డారు. మన భారతీయ కళలు కేవలం వినోదం మాత్రమే కాదు, విజ్ఞానం కూడా.. కళలను ఆదరించడం ద్వారా మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story