- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య నిర్లక్ష్యం..? మూడు నెలల చిన్నారి మృతి, హాస్పిటల్ ముందు ఉద్రిక్తత
జిల్లా కేంద్రంలోని ప్రైమ్ చిన్నపిల్లల హాస్పిటల్‌లో వైద్యుల దౌర్జన్యం వల్లే తమ మూడున్నర నెలల బాలుడు మృతిచెందాడంటూ..

దిశ, డైనమిక్ బ్యూరో : సూర్యాపేటలో మరోసారి ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రైమ్ చిన్నపిల్లల హాస్పిటల్‌లో వైద్యుల దౌర్జన్యం వల్లే తమ మూడున్నర నెలల బాలుడు మృతిచెందాడంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జాటో జలంధర్, మనిషా దంపతులకు ఇదే మొదటి సంతానం. నాలుగు రోజుల క్రితం శిశువుకు జ్వరం రావడంతో, వారు జిల్లా కేంద్రంలోని ప్రైమ్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రారంభంలో శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలపగా, రెండురోజుల తర్వాత ఆరోగ్యం క్షీణిస్తుందని తల్లిదండ్రులు సమాచారం ఇచ్చినప్పటికీ హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్యం మరింత విషమించడంతో శిశువును ఖమ్మం తరలించే ప్రయత్నంలో ఉండగానే బాలుడు మార్గమధ్యలో మృతి చెందాడు. తమ కుమారుడు ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే మృతిచెందాడంటూ హాస్పిటల్ ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. అల్లర్ల సమయంలో బంధువులు హాస్పిటల్ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు, ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో బంధువులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన వారు హాస్పిటల్ పై రాళ్లు రువ్వగా, అందులో ఒకటి కానిస్టేబుల్ తలపై తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో హాస్పిటల్ ఎదుట భద్రత కట్టుదిట్టం చేయగా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్‌ను తాత్కాలికంగా సీజ్ చేసి విచారణ చేపట్టారు. బాధిత కుటుంబం తగిన న్యాయం అందించాలని అధికారులను కోరింది.






