జెట్ స్పీడ్‌తో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.. లబ్ధిదారుల అకౌంట్లలో రూ.175 కోట్లు జమ

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి.

జెట్ స్పీడ్‌తో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు..  లబ్ధిదారుల అకౌంట్లలో రూ.175 కోట్లు జమ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి.ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నిర్మాణాలు ఎక్కడా ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లబ్దిదారులకు ఎక్కడైనా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు. ఇక మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.లక్ష వరకు రుణం తీసుకునే సదుపాయాన్ని సైతం కల్పించారు. వీటికి తోడు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందిస్తున్నారు. మరోవైపు.. లబ్దిదారుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారు.

1,36,390 ఇండ్లు గ్రౌండింగ్

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 4 ల‌క్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాల‌ని ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇండ్లు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. స్టేట్ వైడ్ 80.05 లక్షల అప్లికేషన్లు రాగా.. యాప్‌లో 77.19 లక్షలు అప్‌లోడ్ చేశారు. రెండు రోజుల క్రితం వరకు ఇళ్ల స్టేటస్ పరిశీలిస్తే 1,36,390లకు పైగా గ్రౌండింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 20,075 ఇండ్లు బేస్‌మెంట్ స్థాయి వరకు పూర్తి కాగా 3,871 ఇండ్లు గోడల వరకు, 1,347 ఇండ్లు స్లాబ్ వరకు కంప్లీట్ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండగా మరికొద్ది రోజుల్లో మరో 1,232 నిర్మాణాలు పూర్తి కానున్నాయి.

ధరల నియంత్రణకు కమిటీలు

చాలా మంది నిరుపేదలకు ఇండ్లు మంజూరైనప్పటికీ ధరల ప్రభావంతో నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. వీరిపై ఇప్పటికే ప్రభుత్వం కింది స్థాయి అధికారుల నుంచి రిపోర్టు తీసుకుంది. ఇంటి నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ మండలాల్లో 400 మోడల్ హౌస్‌లు నిర్మించారు. రూ.5 లక్షలతో ఎలా నిర్మించుకోవాలని లబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా, మండల స్థాయిల్లో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే సర్కారు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ కమిటీలో మండలానికి సంబంధించి లేబర్ కమిటీ, తహశీల్దార్, ఎంపీడీవో ఉన్నారు. మరోవైపు.. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది మేస్త్రీలను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి శిక్షణ సైతం ఇచ్చింది.

390 ఏఈల నియామకం

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎక్కడా ఆలస్యం అవ్వకుండా ఇప్పటికే ఉన్న ఏఈలతో పాటు 390 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వారందరికీ పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీరిని మానిటరింగ్ చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో విజిలెన్స్ టీం ఏర్పాటు చేశారు. ఏఈలతో పాటు గ్రామాల కార్యదర్శులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ మెంబర్స్ సైతం ఎప్పటికప్పుడు లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. దీని అమలు కోసం గ్రూప్ -1 ఆఫీసర్లకు బాధ్యత అప్పగించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. వీళ్లు కలెక్టర్లకు సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. గ్రూప్ -1 ఆఫీసర్లను డిప్యూటేషన్ ప్రాతిపదికన కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖ నుంచి రిలీవ్ చేస్తూ ఇటీవల ఆ శాఖ సెక్రెటరీ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని ఆయా జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమించనున్నారు. ప్రస్తుతం ఈ స్థానాల్లో డీఈఈలు వర్క్ చేస్తున్నారు. మరో వైపు.. పంచాయతీ రాజ్ శాఖ నుంచి 79 మంది సీనియర్ అసిస్టెంట్లు, 17 మంది జూనియర్ అసిస్టెంట్లను కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఇటీవల లేఖ రాశారు. ఈ ప్రపోజల్‌ను అంగీకరిస్తూ పీఆర్ డైరెక్టర్ శ్రీజన ఇటీవల జెడ్పీ సీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హౌసింగ్ కార్పొరేషన్‌లో 110 సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించి ఉండగా.. ప్రస్తుతం 14 మంది మాత్రమే పనిచేస్తుండడం గమనార్హం. అందుకే.. మిగతా సిబ్బందిని డిప్యూటేషన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపు

పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి మంగళవారం సెక్రెటరీ స్థాయిలో కలెక్టర్లతో రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే.. గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ సైతం ప్రతి వారం అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ జిల్లాలో అయితే ఇండ్ల నిర్మాణం నెమ్మదిగా ఉన్నదో అక్కడికి పై స్థాయి అధికారులను పంపిస్తున్నారు. గ్రౌండ్ లెవల్‌లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటికి అక్కడే పరిష్కారం చూపిస్తున్నారు. అంతేకాకుండా.. లబ్దిదారులకు ఎక్కడా ఇబ్బంది కాకుండా ప్రతి సోమవారం వారి వారి అకౌంట్లలో అప్పటి వరకు జరిగిన నిర్మాణ స్టేటస్‌ను బట్టి బిల్స్ జమ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు లబ్దిదారుల ఖాతాల్లో రూ.175 కోట్ల వరకు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గిరిజనులకు మరింత చేయూత అందించేందుకు ఐటీడీఏలకు అదనంగా ఇండ్లు మంజూరు చేశారు. 22,000 ఇళ్లను వీరి కోసం అలాట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ఇంటి నిర్మాణాల బాధ్యతలను ఐటీడీఏ పీఓలు స్వయంగా పరిశీలించనున్నారు.

ఇళ్ల స్టేటస్ ఇలా..

మొత్తం అప్లికేషన్లు - 80.05 లక్షలు

యాప్‌లో అప్‌లోడ్ చేసినవి - 77.19 లక్షలు

ఈ ఏడాది లక్ష్యం - 4.50 ల‌క్షలు

మంజూరు చేసినవి - 3 లక్షలకు పైనే..

గ్రౌండ్ అయినవి - 1,36,390

బేస్‌మెంట్ పూర్తయినవి - 20,075

గోడల వరకు పూర్తయినవి - 3,871

స్లాబ్ కంప్లీట్ అయినవి - 1,347

బిల్స్ పేమెంట్ - రూ.175 కోట్లు

Next Story