ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-04 17:25:24  IST  )

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అలర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల విడుదలకు లబ్ధిదారులే స్వయంగా ఫొటోలను అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ పీడీలు ఇతర సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులకు నిర్దేశిత సమయంలో బిల్లులను విడుదల చేయడానికి ఇది తోడ్పడుతుందని ఆయన అన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలు, ఇంతవరకు చేసిన చెల్లింపులు తదితర సమాచారం మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి ఎక్కడి నుంచైనా తెలుసుకునే విధంగా యూనివర్సల్ సెర్చ్ అవకాశాన్ని కల్పించాలన్నారు.

15 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేట్లుగా చూడాలన్న లక్ష్యంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఫొటోలను అప్‌లోడ్ చేసి బిల్లులను జనరేట్ చేసే అవకాశం ఇచ్చామని ప్రకటించారు. గురువారం నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చినట్లు వివరించారు. అందరూ వినియోగించుకునేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది చొరవ చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులే ఫోటోలను ఎలా అప్ లోడ్ చేయవచ్చన్న దానిపై అధికారులకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ఎం.చైతన్యకుమార్, సూపరింటెండింగ్ ఇంజినీర్ భాస్కరరెడ్డి, జనరల్ మేనేజర్ మమత తదితరులు పాల్గొన్నారు.

ఫొటోల అప్‌లోడ్ ఇలా..

- ముందుగా మొబైల్ ఫోన్‌లో ఇందిరమ్మ ఇండ్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత బెనిఫిషియరీ లాగిన్‌లో తమ మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తరువాత డాష్ బోర్డులో లబ్ధిదారుల పేరు, మొబైల్ నెంబరు తదితర వివరాలతో పాటు ఫొటోలు తీయడం (కాప్చర్ ఫొటోగ్రాఫ్) అనే వాటి కింద ఇండ్ల నిర్మాణపు దశలు (గ్రౌండింగ్, బేస్ మెంట్, వాలింగ్, శ్లాబ్, నిర్మాణం పూర్తి) అని కనిపిస్తాయి.

- లబ్ధిదారులు గ్రౌండింగ్ స్థాయి ఫొటోలు అప్‌లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్‌పై క్లిక్ చేస్తే దరఖాస్తుదారు వివరాలు కనిపిస్తాయి. లబ్ధిదారులు ప్రతిపాదిత ఇంటి నిర్మాణ స్థలం నుంచే మొబైల్ ఫోన్‌లోని కెమెరాతో ఫొటోలు తీయాలి. ఇక్కడే కెమెరాలో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి, ఒకసారి సరిచూసుకున్న తరువాత సబ్మిట్ చేయాలి. అటు తరువాత వెనక్కి వెళ్లి గ్రౌండింగ్ బటన్‌పై క్లిక్ చేస్తే వివరాలన్నీ కనిపిస్తాయి.

- అదే విధంగా బేస్మెంట్ స్థాయిలో, నిర్మాణపు పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారుతో పాటు ముందు వైపునుంచి, పక్క నుంచి, పై నుంచి (టాప్ యాంగిల్)లో ఫొటోలు తీయాలి, ఈ ఫొటోలు గ్రౌండింగ్ సమయంలో ఫొటోలు తీసిన ప్రాంతం సమీపం నుంచే తీయాల్సి ఉంటుంది. అటు పైన యాప్‌లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇదే తరహాలో వాలింగ్ దశలోనూ, స్లాబ్ దశలోనూ, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత కూడా ఫొటోలు తీసి లబ్ధిదారులే నేరుగా బిల్లుల కోసం అప్‌లోడ్ చేయవచ్చు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీఈఈలు, పీడీలు తదితర అధికారులు, వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూసుకున్న తరువాతనే లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేస్తారు.

Next Story