అర్హులందరికీ విడ‌త‌ల‌ వారీగా ఇందిర‌మ్మ ఇండ్లు

by Elthuri vijay kumar |

అర్హులైన పేదలందరికి ఇందిర‌మ్మ ఇళ్లు విడ‌త‌ల‌వారీగా ఇస్తామ‌ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హామీనిచ్చారు.

అర్హులందరికీ విడ‌త‌ల‌ వారీగా ఇందిర‌మ్మ ఇండ్లు
X

అర్హులందరికీ విడ‌త‌ల‌ వారీగా ఇందిర‌మ్మ ఇండ్లు

- మంత్రి కొండా సురేఖ

దిశ, వరంగల్ బ్యూరో : అర్హులైన పేదలందరికి ఇందిర‌మ్మ ఇళ్లు విడ‌త‌ల‌వారీగా ఇస్తామ‌ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హామీనిచ్చారు. వ‌రంగ‌ల్ ప‌ర్యటన‌లో ఉన్న మంత్రి సురేఖ వ‌రంగల్ ఈస్ట్ ల‌బ్ధిదారుల‌కు ఇందిర‌మ్మ ఇల్లు మంజూరీ ప‌త్రాలు బుధ‌వారం అంద‌జేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుడికి ఐదు లక్షలు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని వివ‌రించారు. గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేప‌డుతుంద‌న్నారు. ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి సురేఖ తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యంత నిరుపేద అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా ప్రభుత్వం పారదర్శకంగా పోర్టల్ ద్వారా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంజూరి పత్రాలు స్వీకరించిన లబ్ధిదారులు త్వరగా ఇళ్ళను నిర్మించుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేదల సమస్యలు మానవత దృక్పథంతో అధికారులు పరిశీలించి త్వరితంగా పరిష్కరించాలన్నారు. నిరుపేదలు గుడిసెలలో, అద్దెకు ఉంటూ సుదీర్ఘ కాలంగా ఇండ్ల నిర్మాణాలకు వేచి చూస్తున్నారన్నారు. అటువంటి పేద‌ వారి కలలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తున్నదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమం నిరంతరమని, ఇల్లు రాని నిరుపేదలు నిరుత్సాహపడవలసిన అవసరం లేదని, అర్హులైన ప్రతినిరుపేదకు తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమం జోడొద్దుల్లా ముందుకు తీసుకెళుతున్నారని మంత్రి సురేఖ తెలిపారు.

Next Story