- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2047లో ప్రధాన ఆకర్షణగా ఇందిరా మహిళా శక్తి స్టాల్
భారత్ ఫ్యూచర్ సిటిలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2047లో మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ ఫ్యూచర్ సిటిలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2047లో మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న విధానాలకు ఈ స్టాల్ అద్దం పడుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల శక్తి, సాధికారత, వ్యాపార నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు సమగ్రంగా ప్రదర్శించే వేదికగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ నిలుస్తోంది.
పట్టణ పేదరిక నిర్మూళన సంస్ధ (సెర్ప్), తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌లో, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాల నమూనాలు ప్రదర్శిస్తున్నారు. మహిళలే నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి పెట్రోలు బంకు, హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన ఇందిరా మహిళా శక్తి భవనాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ వంటి విభిన్న వ్యాపారాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు సాధించిన విజయాలు ఈ స్టాల్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ వేదిక వరకు మహిళల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శన కోసం ప్రత్యేక స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఎలా వ్యాపారవేత్తలుగా ఎదిగాయి, ప్రభుత్వ ప్రోత్సాహంతో స్వయం ఉపాధి ఎలా సుస్థిర ఆదాయ మార్గాలుగా మారింది అనే అంశాలు ఈ డాక్యుమెంటరీల ద్వారా సందర్శకులు తెలుసుకోగలగుతారు. అలాగే మహిళా, శిశు సంక్షేమం కోసం ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన నూతన కార్యక్రమాల వివరాలను కూడా స్టాల్‌లో సమగ్రంగా ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2047లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాల్, మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి అన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలిచి, దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.






