ఇల్లు కలగానే మిగిలిపోతోంది.. ఇందిరమ్మ పథకం అర్హులకు దూరం..!

by Bhanu |

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం నిజమైన పేదలకు దరి చేరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లు కలగానే మిగిలిపోతోంది.. ఇందిరమ్మ పథకం అర్హులకు దూరం..!
X

దిశ, పెద్దవూర : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం నిజమైన పేదలకు దరి చేరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న తమ సొంత ఇంటి కల నెరవేరడం లేదని పెద్దవూర మండలంలోని పలు గ్రామాల అర్హులు వాపోతున్నారు. గర్నెకుంట గ్రామంలో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా అన్నీ తామే అయ్యి వ్యవహరిస్తున్న ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు, వారు చెప్పిన వారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వారికి అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అర్హులు కాకున్నా వారు చెప్పిన వారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గర్నెకుంట గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ సమీక్షించి ఉన్నతాధికారులతో పారదర్శకమైన సర్వే నిర్వహించాలని, నిజమైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.

గట్టిగా వానొస్తే కూలుతుంది : కాటేపల్లి చెన్నమ్మ, గర్నెకుంట

నా పేరు కాటేపల్లి చెన్నమ్మ (భర్త చనిపోయాడు). మాది పెద్దవూర మండలంలోని గర్నెకుంట గ్రామం. గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాను. నాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాకున్న ఇల్లు శిథిలావస్థలో ఉంది. గట్టిగా వాన వస్తే కూలిపోతుందేమోనని భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. ఈ ఇంట్లో 50ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం. గతంలోనూ ఏ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సొంత ఇంటి కల నెరవేరుతుందని అనుకున్నా కానీ ప్రజాపాలనలో దరఖాస్తు కూడా పెట్టుకున్నా మండల అధికారులు సర్వే కోసం ఇంటికి వచ్చారు.

ఇంటి పరిస్థితిని గమనించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులుగా గుర్తించారు. మొదట వచ్చిన జాబితాలో అర్హుల పేర్లలో నా పేరు కూడా ఉంది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ ప్రస్తుతం వచ్చిన అర్హుల పేర్లలో నా పేరు కనిపించడం లేదు. ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు రంధ్రాలు పడి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. అధికారులు తక్షణమే స్పందించి పారదర్శకంగా సర్వే నిర్వహించి నాకు ఇల్లు మంజూరు చేయాలి.

Next Story