Most Power full Indians -2025: తెలుగు వారిలో ఆ ఐదుగురికే చోటు.. కేసీఆర్, జగన్ కు నో ఛాన్స్, టాలీవుడ్ లో ఆ ఒక్కడే

by Prasad Jukanti |

మోస్ట్ పవర్ ఫుల్ 100 ఇండియన్స్ జాబితా విడుదలైంది.

Most Power full Indians -2025: తెలుగు వారిలో  ఆ ఐదుగురికే చోటు.. కేసీఆర్, జగన్ కు నో ఛాన్స్, టాలీవుడ్ లో ఆ ఒక్కడే
X

దిశ, డైనమిక్ బ్యూరో : మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మరోసారి టాప్‌లో నిలిచారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన 2025 టాప్ 100 ఇండియన్ ప్రభావశీలుర జాబితాలో (Most Powerfull 100 Indians 2025) ప్రధాని ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. జవహర్‌లాల్ నెహ్రు తర్వాత చరిత్రాత్మకంగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని ఈ నివేదిక పేర్కొన్నది. రెండో స్థానంలో అమిత్ షా, మూడో స్థానంలో కేంద్రమంత్రి జైశంకర్, నాలుగో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలవగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంఐఎం అధ్యక్షుడు అసద్దుదీన్ ఒవైసీ, టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ మినహా మిగతా తెలుగువారెవరికీ చోటు దక్కలేదు.

తెలంగాణ సీఎంకు కితాబు..

జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) 28వ స్థానంలో నిలిచారు. గతేడాది నివేదికలో 38వ స్థానంలో ఉన్న ఆయన ఈసారి పది ర్యాంకులు మెరుగుపడి 28వ స్థానం దక్కించుకున్నారు. 2021లో టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడంతోపాటు వర్గపోరుతో కూడిన కాంగ్రెస్ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా విజయంవైపు నడిపించారని ఈ నివేదిక పేర్కొన్నది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌ను ఓడించి ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి బయటివ్యక్తి అని కనిపించినప్పటికీ ఆ విమర్శలన్నింటినీ దాటుకుని పార్టీని విజయతీరంవైపు నడిపినట్లు ఈ రిపోర్టు తెలిపింది. ఆరు గ్యారెంటీల హామీ అమలు ఆయన ముందున్న ప్రధానమైన సవాలు అని స్పష్టం చేసింది. అలాగే యాక్టివ్ అవుతున్న బీజేపీని ఎదుర్కోవడం ఆయనకు సవాలు అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవాల్సి ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

73వ స్థానంలో పవన్ కల్యాణ్..

గతేడాది ఈ జాబితాలో చోటు దక్కించుకోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Cm Chandrababu) ఈసారి 14వ ప్లేస్‌లో నిలిచారు. వైసీపీని ఓడించడానికి కూటమి అవసరమని గ్రహించిన చంద్రబాబు 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక మిత్రపక్షంగా నిలిచారు. స్వర్ణాంధ్ర@2047ను అమలు చేయడం, సూపర్ 6 హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొన్నది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతేడాది ఈ జాబితా చోటు లేకపోయినా ఈసారి 73వ స్థానంలో నిలిచారు.

కేసీఆర్, జగన్‌కు దక్కని చోటు..

జాబితాలో తెలంగాణ, ఏపీ తాజా మాజీ సీఎంలు కేసీఆర్(Kcr), జగన్‌కు (Jagan) చోటు దక్కలేదు. అలాగే కేటీఆర్, లోకేశ్‌కు సైతం స్థానం దక్కలేదు. బిహార్‌లో అధికారంలో లేకపోయినా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 86, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు 87వ స్థానాలు దక్కాయి. ఇటీవల ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా ఈ జాబితాలో 65వ ర్యాంక్‌లో నిలిచారు.

అల్లు అర్జున్@92..

టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) జాబితాలో 92వ స్థానంలో నిలిచారు. టాలీవుడ్ నుంచి మిగాతావారెవరికి స్థానం దక్కలేదు. క్రికెటర్లలో రోహిత్ శర్మ 48, విరాట్ కోహ్లీకి 72, బుమ్రా 83 స్థానం దక్కించుకున్నారు. అలియా బట్ 100 ర్యాంక్‌లో ఈ జాబితాలో ఆఖరిలో నిలిచారు. వీరితోపాటు 10, 11వ స్థానాల్లో ముకేశ్ అంబానీ, గౌతం అదానీలు నిలిచారు. చెస్ విశ్వనాథ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సంజీవ్ ఖన్నాతో పాటు తదితరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Next Story