IMD: హైదరాబాద్‌ రాడార్‌ పబ్లిక్‌కు బంద్! ఎక్స్‌లో ఆరోపణలు.. స్పందించిన వాతావరణ శాఖ

by Ramesh Naini |

భారత వాతావరణ శాఖపై ఎక్స్ వేదికగా పలువురు నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేశారు.

IMD: హైదరాబాద్‌ రాడార్‌ పబ్లిక్‌కు బంద్! ఎక్స్‌లో ఆరోపణలు.. స్పందించిన వాతావరణ శాఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత వాతావరణ శాఖ (India Meteorological Department) పై ఎక్స్ వేదికగా పలువురు నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ రాడార్ (radar) అందుబాటులో లేదని, ఇంకా దేశంలోని అన్ని రాడార్లు ప్రజలకు ఐఎండీలో అందుబాటులో ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే హైదరాబాద్‌ రాడార్‌ పబ్లిక్‌కు బంద్ పెట్టారని ప్రముఖ వాతావరణ నిపుణుడు ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ (Telangana Weatherman) ఎక్స్ యూజర్ బాలాజీ (@balaji25_t) తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండు మూడు రోజులుగా రాడార్ పనిచేయడం లేదని పలువురు నెటిజన్లు సైతం హైదరాబాద్ వాతావరణ శాఖకు ట్యాగ్ చేస్తూ ఆరోపణలు చేశారు. దీనిపై హైదరాబాద్ వాతావరణ శాఖ స్పందించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం ఒక ప్రకటన విడుదల చేశారు. మా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే, కొందరు వ్యక్తులు తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రకటనలో తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉద్దేశపూర్వకంగా నిన్న (గురువారం) భారీ వర్షాలు పడుతున్న సమయంలో మా వెబ్‌సైట్‌లో రాడార్ చిత్రాలను ఉద్దేశపూర్వకంగా అప్‌లోడ్ చేయడం నిలిపివేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఐఎండీ అనేది భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక వాతావరణ సంస్థ, ఇది స్థిరమైన మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యకలాప విధానాల ప్రకారం పనిచేస్తోందని, వాటిని ఎప్పటికీ ఉల్లంఘించదని పేర్కొన్నారు. నిన్న భారీ వర్షాలు పడుతున్న తీవ్ర వాతావరణ పరిస్థితులు సమయంలో మా రాడార్ పూర్తిగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. అయితే, ఆ సమయంలో (ఆగస్టు 6 తేదీ నుంచి) కమ్యూనికేషన్ లోపం కారణంగా మా రాడార్ ఉత్పత్తులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేకపోయామని తెలిపారు. అయినప్పటికీ, మా కార్యాలయం నుంచి ప్రత్యక్ష రాడార్ చిత్రాలతో కూడిన హెచ్చరిక బులెటిన్లను మేము నిరంతరంగా విడుదల చేస్తూనే ఉన్నామని వివరించారు. ‘ఎలాగూ మీరు సమయానికి ఎప్పుడు వర్షాలు పడతాయో చెప్పరు.. కనీసం రాడార్ మ్యాప్‌లను అయిన త్వరగా అప్‌లోడ్ చేయండి’ అని ఈ ప్రకటనపై ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది.

Next Story