ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ అన్నదే మా నినాదం: మాజీ మంత్రి కేటీఆర్

by Kema Shiva Kumar |

అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అని.. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ అన్నదే మా నినాదం: మాజీ మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అని.. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణమన్నారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలన్నారు. అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. విజయాల గురించి మాట్లాడటానికి ఎల్లప్పుడూ తనకు గర్వంగా ఉంటుందన్నారు.

ఆటోమోబైల్ రంగంలో పీడీఎస్ఎల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పీడీఎస్ఎల్ తమ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని కోరారు. ఇంగ్లాండ్‌లో యూనివర్సిటీ, ఇండస్త్రీల మధ్య ఉన్న పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ సంస్థ, వార్విక్ యూనివర్సిటీలో తన నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించుకోవడం తెలంగాణ టాలెంట్‌కు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే ఆటోమోటివ్ హబ్‌గా పూణే, చెన్నైల సరసన హైదరాబాద్ నిలిచిందన్నారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్‌‌తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు.

ఆటోమోటివ్ రంగంలో కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కే పరిమితం కాకుండా తయారీ రంగంలో కూడా తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలు ఉపయోగపడతాయన్నారు. భారతదేశంలో ఫార్ములా ఈ- రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ప్రారంభించాయని గుర్తుచేశారు. పీడీఎస్ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల మాట్లాడుతూ.. కేటీఆర్ ఆలోచనలు, పనితీరు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. ఆయన చేసిన పనులు, తీసుకొచ్చిన విధానాలు ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగానికి చేసిన కృషి తో ఐటీ ఒక్కటే కాదు అనేక రంగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలబడిందన్నారు.

Next Story