ప్రజలపై పన్ను భారం పడకుండా ఆదాయాన్ని పెంచండి.. అధికారులతో డిప్యూటీ సీఎం రివ్యూ

by Geesa Chandu |

ప్రజలపైన అదనపు పన్నుల భారం పడకుండా, ప్రభుత్వ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవడంపై, కొత్త ఆలోచనలతో ప్రణాళిక రూపొందించాలని వివిధ శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

ప్రజలపై పన్ను భారం పడకుండా ఆదాయాన్ని పెంచండి.. అధికారులతో డిప్యూటీ సీఎం రివ్యూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలపైన అదనపు పన్నుల భారం పడకుండా ప్రభుత్వ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవడంపై కొత్త ఆలోచనలతో ప్రణాళిక రూపొందించాలని వివిధ శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంపై వినూత్నంగా ఆలోచించి ప్రత్యామ్నాయాలను శోధించాలన్నారు. పలు కీలక శాఖల అధికారులతో సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించి కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వనరుల సమీకరణపై మైనింగ్, ట్రాన్స్ పోర్ట్, స్టాంప్స్-రిజిస్ట్రేషన్స్, ఎక్సయిజ్, కమర్షియల్ టాక్స్ తదితర విభాగాల అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని నొక్కిచెప్పారు. ఒకవైపు లీకేజీలను అరికట్టడం, మరోవైపు ఆదాయ వనరులు పెరిగేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలన్నారు.

ఆదాయ వనరుల సమీకరణపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్నారని, రెగ్యులర్‌గా కీలక శాఖలు సమావేశాలు కూడా జరుపుకుంటున్నాయని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నాలుగు గోడల మధ్యనే పెద్దలు నిర్ణయాలు తీసుకునేవారని, అధికారులకు స్వతంత్రత ఉండేది కాదని, కానీ ప్రస్తుతం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంలో అన్ని శాఖల ఆఫీసర్లకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ఆ పరిస్థితులకు తగినట్లుగానే వినూత్న ఆలోచనలు చేసి ఖజానాకు నిధులు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులు వారివారి శాఖలకు సంబంధించి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని, వాటికి తగిన ఫలితాలను సాధించాలన్నారు. ఒకవైపు విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేక పాలసీని ప్రభుత్వం తీసుకొస్తుందని, మిగిలిన శాఖల్లోనూ అలాంటి అవకాశాలను మదింపు వేయాలన్నారు.

ఆదాయాన్ని ఆర్జించే శాఖల్లో మైనింగ్ శాఖ కీలకమైనదని, ఒకవైపు ప్రజల అవసరాలు, మరోవైపు రాష్ట్ర ఖజానాను ఆర్థికంగా పరిపుష్టి చేసే బాధ్యత ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అందరికీ ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన పట్టణాలకు సమీపంలోనే సబ్-యార్డులను నెలకొల్పాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లోనూ ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచాలని మైనింగ్ శాఖ అధికారులకు సూచించారు. ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పథకంలో వేగాన్ని మరింతగా పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు.. ఇప్పటివరకు సమకూరిన ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ మేరకు ఆదాయం రావచ్చు.. తదితర అంచనాలపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు.. అసైన్డ్ భూములు.. కోర్టు వివాదాలపైనా డిప్యూటీ సీఎం సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కావొద్దని నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరుల్లో జీఎస్టీ ఒకటని, ఈ అంశంలో లీకేజీలను అరికట్టి ఆదాయాన్ని పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్, కమర్షియల్ టాక్స్, రెవెన్యూ కమిషనర్ రిజ్వీ, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, హౌజింగ్ స్పెషల్ సెక్రెటరీ గౌతమ్, మైనింగ్ శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ సుశీల్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం:

ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో శాంతిభద్రతలు కీలకమైన అంశమని నొక్కిచెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు కీలక భూమిక పోషిస్తున్నాయని, ఆ రంగం సుమారు నాలుగున్నర లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నదని, ఏజెన్సీలు ప్రభుత్వం నుంచి లైసెన్సులు తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులుగా గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తున్నదని, వారికి మంచి వేతనాలు ఇవ్వడం అవసరమని, కనీస వేతనం ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. హైదరాబాదులోనే సుమారు లక్ష మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలను పోలీసు శాఖ కూడా ప్రోత్సహించాలన్నారు. శాంతిభద్రతల విషయంలో సమిష్టి కృషితో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవాలన్నారు. ఫార్మల్ పోలీసింగ్‌కే పరిమితం కాకుండా ఇన్‌ఫార్మర్ పోలీసింగ్‌పైన దృష్టిపెట్టిన పోలీసు అధికారులను ఆయన అభినందించారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్నదని, సాఫ్ట్ వేర్, ఫార్మా, ఏరో స్పేస్, లైఫ్ సైన్సెస్, ఇండస్ట్రీస్, మాన్యుఫ్యాక్చరింగ్ తదిత రంగాల విస్తరణతో ఈ సిటీ ఒక మినీ రాష్ట్రంగా డెవలప్ అవుతుందన్నారు.

Next Story