- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: కొంత మంది, కొన్ని మీడియా వేదికలుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని అసత్య, ఆధారం లేని ఆరోపణలు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.విక్టర్, ప్రధాన కార్యదర్శి కే చంద్రకళ, కోశాధికారి చొల్లేటి వెంకటేశ్వర్లు ఖండించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిరాధారమైన వదంతులు, కల్పిత కథనాలు, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బ తీసే వ్యాఖ్యలతో మహిళా అధికారుల ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు చేయడం పత్రికా ధర్మాలకు విరుద్ధమని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేదిలా ఉందన్నారు. ఇలాంటి ప్రచారం మహిళా అధికారుల వ్యక్తిత్వ సహనానికి కారణమవుతుందన్నారు. వారి విధుల నిర్వహణను తప్పుదోవ పట్టించేలా పోస్టింగులు, వ్యక్తిగత వ్యవహారాలపై అసభ్య సూచనలు చేయడం చట్టపరంగానూ, నైతికంగానూ అసహ్యకరమైన చర్యగా అభివర్ణించారు.
ఈ తరహా దుష్ప్రచారం పౌర సేవల గౌరవాన్ని దిగజారుస్తుందన్నారు. పరిపాలన వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బ తీస్తుందన్నారు. మహిళల పట్ల ఉన్న పాత కాలపు ఫ్యూడల్, లింగ వివక్ష భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం స్పష్టంగా ప్రకటించింది. మహిళా ఐఏఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, దుష్ఫ్రేరణతో కూడినవేనన్నారు. తక్షణం సదరు మీడియా సంస్థలు నిస్సందేహంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అసత్య కంటెంట్ లను అన్ని వేదికల నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు భయం లేకుండా, అవమానం లేకుండా ప్రజా సేవ చేయగల వాతావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.






