ఈ ఏడాది పాలకుల మధ్య పోరాటాలు తప్పవు.. ప్రభుత్వ ఉగాది వేడుకల్లో బాచంపల్లి సంతోశ్ కుమార్

by Prasad Jukanti |

ఈ తెలుగు నూతన సంవత్సరంలో దక్షిణాధి ముఖ్యమంత్రులు జాగ్రత్తగా ఉండాలని పంచాగ కర్త హెచ్చరించారు.

ఈ ఏడాది పాలకుల మధ్య పోరాటాలు తప్పవు.. ప్రభుత్వ ఉగాది వేడుకల్లో బాచంపల్లి సంతోశ్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పరాభవ నామ సంవత్సరం పేరు వినగానే భయపడాల్సిన పని లేదని అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవమే పరాభవన నామసంవత్సరం అని ప్రముఖ పంచాంగ కర్త డా. బాచంపల్లి సంతోశ్ కుమార్ అన్నారు. రవీంద్ర భారతిలో భాషా, సంస్కృతిక, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో ఇవాళ శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరైన ఈ కార్యక్రమాన్ని సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాచంపల్లి సంతోశ్ కుమార్ పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ పరాభవనామ సంవత్సరం ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయని పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య పోరాటాలు ఉంటాయన్నారు. ఆధిపత్యాన్ని కోరుకునే వారు ఎక్కువవుతారు. కానీ ధర్మంగా ఉన్నవారు కచ్చితంగా నిలబడి విజయం సాధిస్తారని చెప్పారు. ఈ ఏడాది నదులు పుష్కలంగా ప్రవహిస్తూ తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికి కడుపునిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందం పంచే సంవత్సరంగా ఉండబోతుంది. చింత, చికాకు వదిలి కలిసికట్టుగా ఉండాలన్నారు. మనలో మనం కొట్లాడితే కుటుంబం పాడవుతుందని హెచ్చరించారు.

ముఖ్యమంత్రులు జాగ్రత్తగా ఉండాలి:

ఈ సంవత్సరం మూడు రాశులకు మారుతున్నాడని సింహగురువుతో రాహు కాలం సంయోగం చేసి 31 అక్టోబర్ నుండి 6 డిసెంబర్ వరకు, 25 జనవరి నుండి జూన్ 26 వరకు దక్షిణాది వైపు ఉన్న ముఖ్యమంత్రులంతా బాగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది గురువే రాజుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచించే వారు, మంచి చేయడానికి కంకణం కట్టుకోవడం, నిరంతరం ధర్మాన్ని కాపాడటానికి అస్మదీయులను సైతం పక్కన పట్టి ధర్మనిరంకుశత్వం ఉంటే రాజుకు ఈ సంవత్సరం తిరుగు లేదన్నారు. ఈ ఏడాది నొసట చిరునవ్వులు ఉంటే లోపల అంతా వేరే రకంగా ఉంటుందని అందువల్ల పాలకుల మధ్య నిత్యం సయోధ్య పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదే నోటిపై కనిపించే చిరునవ్వులను చూసి ఉప్పొంగిపోవద్దని లోపల చూసి ఆలోచన చేయాలి.

బంగారం ధరలు పెరడం లోక నాశనమే:

ఈ ఏడాది పాడి పంటలు బాగున్నాయి. వర్షాలు బాగున్నాయన్నారు. తెలంగాణలో ఈ ఏడాది భూమికి సంబంధించిన అభివృద్ధి ఉంటుందని ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ ఏడాది గతేడాది కంటే రియల్ ఎస్టేట్ రంగం మెరుగుపడబోతోందని జోస్యం చెప్పారు. రుణాలు చేసి భూములు కొనుగోవద్దని, వింధులు తగ్గించాలన్నారు. ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, బంగారం ధరలు పెరగడం శాస్త్రరీత్యా లోకానికి నాశనమే అని షేర్స్ పెట్టుబడులు పెట్టవద్దని, బ్యాంకులో క్యాష్ రూపంలో డబ్బులు దాచుకోవాలని సూచించారు. ఖర్చులు అదుపులో పెట్టుకున్న వారికే ఈ సంవత్సంరం బాగుటుందని శాస్త్రం చెబుతున్నారు.

ఆ శాఖను చూసే వారికి చిక్కులే:

పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి, వ్యవసాయం మొదలైన అంశాల్లో ప్రాధాన్యత పెరుగుతుందని, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారంలో కొత్త జాగ్రత్త పడాల్సి ఉంటుందని ఈ ఏడాది ఆర్థిక శాఖను చూసే వారికి చాలా చిక్కు ఉందన్నారు. ఈ విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటేనే పరిపాలన బాగుంటుంది. లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని శాస్త్రం చెబుతోంది. ఆరోగ్యశాఖలో కొంత అద్భుతమైన ప్రక్షాళన జరుగుతుంది. ప్రజావైద్యం కోసం మంత్రులంతా కంకణం కట్టుకుంటారు. ఒప్పందాలు, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహరాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది. అంతర్జాతీయ న్యాయవేదికపై భారత దేశం తిరుగులేని ముద్ర వేయబోతోంది. భారత దేశం ఇతర దేశాలకు పరాభవం కలిగించబోతోంది. ప్రపంచంలో సునామీలు రాబోతున్నాయని చెప్పారు.

Next Story