ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో ఇన్‌చార్జి వీసీ హల్‌చల్.. సీఎం తనకు క్లోజ్ అంటూ బెదిరింపులు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-24 02:05:45  IST  )

జవహార్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ టి.గంగాధర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అర్హులను కాదని తన సన్నిహితులకు పదోన్నతులు కల్పిస్తున్నారనే ఆరోపణలపై విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి.

ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో ఇన్‌చార్జి వీసీ హల్‌చల్.. సీఎం తనకు క్లోజ్ అంటూ బెదిరింపులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జవహార్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ టి.గంగాధర్ తీరుపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు తెలుస్తున్నది. వర్సిటీలో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తనకు ఇష్టం ఉన్న వ్యక్తులకు ప్రమోషన్లు ఇవ్వడం, గిట్టని వారిని పక్కన పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఆయన వ్యవహారశైలిపై విసిగి ప్రశ్నిస్తే ‘నేను సీఎంకు చాలా క్లోజ్ నన్ను ఎవరు ఏం చేయలేరు’ అని బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఆధారాలతో సహా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఆయన నియామకమే నిబంధనలకు విరుద్ధం..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని వర్సిటీలకు పూర్తి స్థాయి వీసీలను నియమించింది. కానీ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి మాత్రం ఇన్‌చార్జి వీసీనే కొనసాగిస్తున్నది. దీనితో ఇన్‌చార్జి వర్సిటీ వీసీగా ఉన్న గంగాధర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యాశాఖ సెక్రెటరీ, సీఎంఓకు ఫిర్యాదులు చేరినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం వీసీని నియమించలేని పరిస్థితులు వర్సిటీలో నెలకొంటే ఇన్‌చార్జి వీసీని నియమించడం సాధారణం. కానీ, ఇన్‌చార్జి వీసీగా నియమించే వ్యక్తికి కనీసం పీహెచ్‌డీ అర్హత, 10 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా చేసిన అనుభవం ఉండాలి. ప్రస్తుత ఇన్‌చార్జి వీసీకి మాత్రం ఆ రెండు అర్హతలు లేవని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తున్నది. మరోవైపు వర్సిటీ పాలనా వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకం విషయంలో ఇన్‌చార్జి వీసీ తనకు ఇష్టం ఉన్న వ్యక్తులను రికమెండ్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సీనియారిటీ ఉన్న ఫ్యాకల్టీలను పక్కన పెట్టి తనకు అనుకూలమైన వ్యక్తులను ఈసీ మెంబర్లుగా నియమించాలంటూ సంబంధిత ఫైల్‌ను ప్రభుత్వానికి పంపినట్లు ప్రచారం జరుగుతున్నది.

నేనే రాజు నేనే మంత్రి..

వర్సిటీ పాలక నిర్ణయాల్లో ఇన్‌చార్జి వీసీ వ్యవహార తీరు ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే తీరుగా ఉందని విమర్శలు ఉన్నాయి. తనకు నచ్చింది, తనకు తోచినట్లుగా పాలసీ నిర్ణయాలు తీసుకోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతున్నదని ఆరోపణలున్నాయి. ఓ మహిళా ప్రొఫెసర్ ఢిల్లీలో పనిచేస్తోన్న సమయంలో విజిలెన్స్ కేసులో ఇరుక్కున్నారు. కానీ, ఆమె ఇక్కడ జాయిన్ అయిన తరువాత కొన్ని నెలలకే కేసు పెండింగ్‌లో ఉండగానే ప్రమోషన్ ఇచ్చారు. పైగా ఇద్దరు సీనియర్లను కాదని ఆమెకు ఇవ్వడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పీహెచ్‌డీ ఉన్న వ్యక్తులకు ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. అయినా, తనకు సన్నిహితులనే కారణంతో ఓ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చి, సదరు వ్యక్తులను ఈసీ మెంబర్లుగా నియమించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి నకిలీ పీహెచ్‌డీ పట్టాతో డిగ్రీ పొందినట్లూ ఫిర్యాదులు ఉన్నాయి. కానీ తనకు సన్నిహితుడు కావడంతో ఆయన్ను ఈసీ మెంబర్‌గా నియమించేందుకు ఇన్‌చార్జి వీసీ చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న ఓ జూనియర్‌ను ఈసీ మెంబర్ గా అపాయింట్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.

బస్సును అమ్మేసిన వర్సిటీ..

ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కు ఫీల్డ్ విజిట్ తప్పనిసరి. వివిధ ప్రాంతాల్లోని చారిత్రాక కట్టడాల్లో ఉన్న ఆర్కిటెక్చర్, చిత్ర లేఖనం, శిల్పాలను పరిశీలించేందుకు తరుచుగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం వర్సిటీలో రెండు బస్సులు ఉండగా వాటిని రెగ్యూలర్‌గా సర్వీస్ చేయించకపోవడంతో ఒకటి రిపేరుకు వచ్చింది. దీనితో ఒక బస్సును అమ్మేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఒకే బస్సు ఉండటం వలన స్టడీ టూర్లు, ఫీల్డ్ వర్కులకు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఒక బస్సును ఉపయోగించుకోవాలంటే 15 రోజుల ముందు దరఖాస్తు పెట్టుకోవాలనే నిబంధనల వలన స్టూడెంట్స్ ఆ బస్సు జోలికి వెళ్లడం లేదని తెలుస్తున్నది.

Next Story