- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tims Hospital: సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంపై దామోదర కీలక ఆదేశాలు
ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్‌లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని మంత్రి దామోదరరాజనర్సింహ అధికారులకు ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను (Sanath Nagar TIMS Hospital) సిద్ధం చేయాలని అధికారులను మంత్రి దామోదరరాజనర్సింహ (Damodara Rajanarasimha) ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు. ఇవాళ సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ పనులను పర్యవేక్షించిన ఆయన రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు.
సరిపడ కౌంటర్లు ఉండాలి:
పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఓపీ, ఫార్మసీ కౌంటర్లు ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ యంత్రాలు పూర్తిస్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జేఎండీ మయాంక్ మిట్టల్, డీఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.






