RTC: తెలంగాణ ఆర్టీసీలో ఏఐ సేవలు .. పండగల వేళ ఏఐ షెడ్యూలింగ్

by Prasad Jukanti |

తెలంగాణ ఆర్టీసీలో ఏఐ వినియోగంలో అరుదైన ఘనత సాధించింది.

RTC: తెలంగాణ ఆర్టీసీలో ఏఐ సేవలు ..  పండగల వేళ ఏఐ షెడ్యూలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) యుగం నడుస్తోంది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) వినియోగంలోకి తీసుకువచ్చింది. త‌మ ఉత్పాదకత పెంపు, సిబ్బంది ప‌నితీరు, ఆరోగ్య స్థితి ప‌ర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, ర‌ద్దీకి అనుగుణంగా స‌ర్వీసుల‌ ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఆర్టీసీ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థ టీజీ ఆర్టీసీకి తోడ్పాటు అందిస్తున్నదని, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోందని ఆర్టీసీ పేర్కొంది.

ప్రత్యేక టీమ్ ఏర్పాటు:

సంస్థలో ఏఐ వినియోగం కోసం యాజమాన్యం ఇప్పటికే ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారుల‌ను గుర్తించి ఆ టీమ్‍లో ప్రాధాన్యం కల్పించి వారికి హన్స ఈక్విటీ పార్ట్ నర్స్ తో శిక్షణ ఇస్తోంది. ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొద‌ట‌గా 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‍లో భాగంగా ఉద్యోగుల‌కు చేసిన వైద్య ప‌రీక్షల ఆధారంగా ఆరోగ్య ప‌రిస్థితిన ఏఐ, మెషిన్ లెర్నింగ్ స‌హ‌కారంతో అంచ‌నా వేస్తున్నారు. మొద‌ట పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో అమ‌లు చేయ‌గా మంచి ఫ‌లితాలు రాగా ప్రస్తుతం అన్ని డీపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

ఏఐతో షెడ్యూలింగ్:

సంస్థ కార్యకలాపాల్లో విస్తృతంగా ఏఐ వినియోగించుకోవాలని భావిస్తున్న ఆర్టీసీ.. త్వరలోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్ కోసం సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే రోజు, తిథి, పండుగలు, వారల్లో ఏఐ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఆ మేరకు బస్సులను సంస్థ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్టుకు అమలు తీరుపై ఇటీవలే సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంస్థ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా త‌మ పనితీరు మెరుగుపరచుకోవడానికి ఏఐని వినియోగించుకోవ‌డంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ ఉన్నతాధికారులను అభినందించారు. ఈ ఏఐ ప్రాజెక్ట్ అమ‌లుకు సమష్టిగా ప‌నిచేసి సంస్థ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ కృషి చేయాలని సూచించారు.

Next Story