మార్కెట్ విలువల పెంపు ఎఫెక్ట్.. 4 రోజుల్లోనే 14,774 ఏకంగా రిజిస్ట్రేషన్లు

by Kema Shiva Kumar |

తెలంగాణలో నేటి నుంచి భూముల మార్కెట్ విలువల పెంపు అమల్లోకి వస్తుండటంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులు జనంతో కిక్కిరిశాయి.

మార్కెట్ విలువల పెంపు ఎఫెక్ట్.. 4 రోజుల్లోనే 14,774 ఏకంగా రిజిస్ట్రేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలు పెంచింది. అవి నేటి నుంచి అమల్లోకి రానుండటంతో ఈ భారం రిజిస్ట్రేషన్లపై అధికంగా ఉంటుంది. అందుకే పాత రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లకు గురువారం ఆఖరి రోజు కావడంతో లెక్కకు మించిన రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలు కిక్కిరిశాయి. పెద్ద సంఖ్యలో జనం రావడంతో నిల్చోవడానికి కూడా దారి లేకుండా కనిపించింది. రాత్రి పొద్దుపోయే దాకా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నడిచింది. బుక్ చేసిన స్లాట్లు అన్నింటినీ పూర్తి చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ రిజిస్ట్రార్లు అవిశ్రాంతంగా కృషి చేశారు. తెల్లారితే కనీసం 50 శాతం స్టాంప్ డ్యూటీ అదనంగా కట్టాల్సి వస్తుందని జనం ఆందోళన చెందారు. అగ్రిమెంట్ ప్రకారం ప్లాట్లు, ఇండ్లకు కనీసం 45 రోజులు, వ్యవసాయ భూములకైతే మూడు నెలల సమయం ఉంటుంది. కానీ, మార్కెట్ విలువ పెంచడం వల్ల అదనపు భారం పడుతుందని ముందస్తుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆపసోపాలు పడ్డారు.

పెను భారం..

మార్కెట్ విలువ పెంచడం అంటే అన్ని రకాలుగా భారాన్ని మోయాల్సిందే. ప్లాట్ విలువ రూ.కోటి ఉంటే ఇప్పుడు రూ.10 లక్షల వరకు వైట్ మనీ చూపిస్తున్నారు. అంటే రూ.10 లక్షలు మాత్రమే చెక్ పేమెంట్ లేదా ఆన్ లైన్ పేమెంట్ అమ్మే వ్యక్తులకు చేస్తున్నారు. మిగతా రూ.90 లక్షలు క్యాష్, ఇతర రూపాల్లో ఇస్తున్నారు. ఇప్పుడైతే ధరలు కనీసం 50 శాతం పెంచే అవకాశం ఉంది. అతి తక్కువ ధరలు ఉన్న చోట 100 శాతం పెంచుతున్నారు. దాంతో రూ.20 లక్షల నగదు, స్టాంప్ డ్యూటీ మొత్తం లీగల్ గా చెల్లించాలి. ఇంత పెద్ద మొత్తం వైట్ మనీ చూపించడం సామాన్యులకు.. ఆఖరికి అధికారులకు కూడా కష్టమే. అందుకే ముందే మేల్కొన్నారు.

35 రోజుల్లో అద్భుతం..

ఎప్పుడైతే భూముల ధరలు పెరుగుతాయని ప్రకటించారో అప్పటి నుంచి ట్రాన్సక్షన్స్ పెరిగాయి. అందుకే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయపు పని వేళలను పెంచారు. స్లాట్లను పెంచారు. ఏకంగా సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం లభించింది. మే నెల మొత్తంలో ఎన్ని ట్రాన్సక్షన్స్ జరిగాయో, ఈ నెల నాల్గో తేదీ వరకు అందులో 25 శాతం ట్రాన్సక్షన్స్ జరిగినట్టు సమాచారం. అంటే భూముల మార్కెట్ విలువల పెంపు భారాన్ని అర్ధం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ధరల పెంపు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

తెలంగాణలో 92,000 ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించి నేటి నుంచి అమల్లోకి తెస్తుండగా, ORR లోపల, శంషాబాద్, కోకాపేట లాంటి చోట్ల 50-100% వరకు పెంపుతో ఏటా రూ.1,200 కోట్ల అదనపు ఆదాయం రానుంది.

Next Story