- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందిచాలి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఎండల తీవ్రతపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖానాల్లో తాగునీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు, అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు వంటి అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎండాకాలం నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు తీసుకుంటున్న చర్యలను, ఆసుపత్రులలో అవుట్ పేషెంట్, ఇన్-పేషెంట్ల కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. వడదెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు అన్ని ఆసుపత్రుల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, అవసరమైన మెడిసిన్, ఓఆర్‌ఎస్ (ORS) వంటివి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్లు, ఇన్-పేషెంట్లు, వారి అటెండెంట్లకు మరియు సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పెద్ద ఆసుపత్రులలో ప్రతి బ్లాక్‌లో, ప్రతి ఫ్లోర్‌లో డ్రింకింగ్ వాటర్ సౌకర్యం ఉండాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున రోగులకు, డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, ఐసీయూలలో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. రిపేర్లు ఉంటే వెంటనే చేయించాలని, అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని సూచించారు.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుల్లో ప్రత్యేక వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే జనరేటర్లు పనిచేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.






